బిహార్‌లోని కటిహార్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మహానంద నదిలో బంగాల్ నుంచి బిహార్‌కు వెళ్తున్న ఓ పర్యటక బోటు బోల్తాపడి ముగ్గురు మృతి చెందారు. 20 మంది గల్లంతయ్యారు. కటియార్ జిల్లా అబాద్పుర్ లోని డమ్డోలియా-బాజీద్పుర్ మధ్య బంగాల్-బిహార్ సరిహద్దులో జరిగిందీ ఘటన.
ప్రమాద సమయంలో పడవలో 80 మంది పర్యటకులు ఉన్నట్లు సమాచారం. నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం, బోటులో సామర్థ్యానికి మించి పర్యటకులు ఉన్న కారణంగానే పడవ అకస్మాత్తుగా బోల్తా పడిందని తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. గల్లంతైన వారికోసం గాలింపు కొనసాగుతోంది.
"బోటు సామర్థ్యానికి మించి పర్యటకులను తీసుకెళ్లడం కారణంగానే ప్రమాదం జరిగింది. బోటు సామర్థ్యం 40 మంది మాత్రమే. కానీ దానికి రెట్టింపు సంఖ్యలో పర్యటకులను ఎక్కించారు. బోటులోని వారిలో కొంతమంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. మరి కొంతమందిని స్థానికులు కాపాడారు. కొందరి ఆచూకీ తెలియాల్సి ఉంది. గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపడుతున్నాం. "
-పోలీసు అధికారి.
ఇదీ చూడండి: ఈటీవీ-భారత్ రిపోర్టర్‌పై విద్యార్థుల దాడి!