ప్రపంచం శాస్త్రసాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నప్పటికీ.. కొన్ని ప్రదేశాల్లో సంప్రదాయాల పేరిట మూఢనమ్మకాలు ఇంకా రాజ్యమేలుతున్నాయి. పెళ్లి అంటే ఏమిటో సరిగా తెలియని అమ్మాయిలకు బాల్యవివాహాలు ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. కుటుంబ సంప్రదాయమనో, సామాజిక ఆంక్షల పేరుతోనో లేదా బహిష్కరణకు గురవుతామనే భయం కారణంగానో ఈ మూఢనమ్మకాలను పాటిస్తున్నారు ప్రజలు. బాల్యవివాహాలు చేస్తూనే ఉన్నారు.
మగద గౌడ సమాజంలో..
ఇలాంటి సంప్రదాయమే ఒడిశా రాయ్‌గఢ్ జిల్లాలోని గౌడ లేలిబడి గ్రామంలో కొనసాగుతోంది. ఈ గ్రామంలో 50 మగద గౌడ కుటుంబాలు ఉన్నాయి. ఈ గ్రామంలో డోలు వాయిద్యాలు, విద్యుత్తు దీపాలు, బాణసంచా వెలుగులు కనువిందు చేస్తే.. అక్కడ ఏదో ఒక బాల్య వివాహం జరుగుతోందని అర్థం. ప్రజలంతా ఈ కార్యక్రమంలో పాల్గొని సరదాగా గడుపుతారు. నృత్యాలు చేస్తారు.
పెళ్లి చేయకపోతే అరిష్టం..
పెళ్లికి ముందే ఒక అమ్మాయి యుక్త వయసుకు వస్తే.. అది ఆ కుటుంబానికి చెడు శకునమని, గ్రామానికి అరిష్టమని విశ్వసిస్తారు ఇక్కడివారు. ఈ నమ్మకంతోనే బాలికలకు 5-10 ఏళ్ల మధ్య వయసులోనే వివాహం జరిపించటం ఆనవాయితీగా మారింది. ఈ సంప్రదాయాన్ని 'కుందబార్ ప్రతా'గా పిలుస్తారు.
ఒకవేళ పెళ్లికి ముందే యుక్త వయసుకు వస్తే.. ఆ బాలికను వారి సమాజం నుంచి వెలివేస్తారు. కుటుంబానికి కళంకం తెచ్చిన వ్యక్తిగా చూస్తారు. వారి పూర్వీకులు చెప్పినట్లుగా సంప్రదాయాల ప్రకారం యుక్త వయసుకు వచ్చిన అమ్మాయిని ఊరేగింపుగా తీసుకెళ్లి అర్ధరాత్రి అడవిలో ఒంటరిగా వదిలేస్తారు.
ఈ గ్రామంలో ఉండే మగద గౌడ సమాజంలోని ధనికులైనా, పేదవారైనా ఇదే సంప్రదాయాన్ని ఆచరిస్తారు.
ఇదీ చూడండి: 23 మంది బంగ్లాదేశీ అక్రమ వలసదారుల అరెస్ట్