కౌసాని... ఉత్తరాఖండ్ బాగేశ్వర్ జిల్లాలోని ఓ గ్రామం. ప్రకృతి అందానికి ప్రసిద్ధి. హిమాలయాల అందాలను తనివితీరా చూడటానికి అద్భుతమైన ప్రాంతం. ఈ గ్రామ అందాలకు మహాత్మాగాంధీ సైతం ముగ్ధుడయ్యారు. కౌసానిని స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియాగా అభివర్ణించారు.
సప్తశోభితమైన ఇక్కడి ఎత్తైన కొండల్ని చూస్తూ... ప్రఖ్యాత అనాసక్తి ఆశ్రమంలో గడిపేందుకు పర్యటకులు వస్తుంటారు.
ఎటు చూసినా పచ్చికబయళ్లతో, సహజ సౌందర్యంతో ఉట్టిపడే కౌసాని గ్రామానికి మహాత్మాగాంధీ 1929లో వచ్చారు. రెండు వారాలు గడిపారు. ఆశ్రమంలోని ప్రశాంతతకు మైమరచిపోయారు. అనాసక్తి యోగాను గాంధీజీ సాధన చేశారు.
మహాత్ముడు సందర్శించడం వల్ల.. ఆయనకు నివాళిగా ఈ ఆశ్రమానికి గాంధీ ఆశ్రమం అని పేరు పెట్టారు. గాంధీ జీవితంలోని అనేక కోణాలు తేలిపే బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు, పుస్తకాలు ఈ ఆశ్రమంలో చాలా ఉన్నాయి.
బాపు జీవితం గురించి తెలుసుకునేందుకు... పరిశోధకులు, తత్వవేత్తలు, ఆధ్యాత్మికవేత్తలతో పాటు స్థానికులకు అనాసక్తి ఆశ్రమం... ముఖ్య కేంద్రంగా మారింది.
ఈ ఏడాది జరగనున్న మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవాలను దృష్టిలో పెట్టుకుని అనాసక్తి ఆశ్రమంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
సత్యశోధన, అంహిసపై ప్రపంచానికి గాంధీజీ ఇచ్చిన సందేశాన్ని చాటేందుకు.. పాఠశాల విద్యార్థులతో ర్యాలీలు నిర్వహించనున్నారు.
గాంధీజీ 150వ జయంత్యుత్సవం నాడు.. అనాసక్తి ఆశ్రమంతో పాటు కౌసాని గ్రామంలో పరిశుభ్రతపై ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నారు.
ఆశ్రమంలో చిత్రలేఖనం, ఉపన్యాసాలపై పాఠశాల విద్యార్థులకు పోటీలు నిర్వహించనున్నారు.
మొక్కలు నాటనున్నారు. మహిళల కోసం వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నారు.
మహాత్ముడికి సంబంధించిన అరుదైన 150 ఛాయచిత్రాలు కలిగిన అనాసక్తి ఆశ్రమం ప్రపంచ చారిత్రక వారసత్వ సంపద. ఈ ఛాయచిత్రాలు ఆశ్రమంలో తప్ప మరెక్కడా లేవు.
గాంధీజీ 1929లో వచ్చారు. బాగేశ్వర్‌లో స్వాతంత్ర్య ఉద్యమం జరుగుతుందని తెలుసుకుని గాంధీ తొలుత అక్కడకు వెళ్లారు. తిరిగొస్తూ కౌసానిలో ఆగారు. ఇక్కడ ఒక బంగ్లా ఉండేది. గాంధీ ఇక్కడే విశ్రాంతి తీసుకున్నారు. కౌసాని ప్రకృతి సౌందర్యాన్ని చూసి ముగ్ధుడయ్యారు. అనాసక్తి యోగా సాధన చేశారు. తర్వాత దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. సుచేతా కృప్లానీ ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గాంధీ సిద్ధాంతాలకు ప్రచారం కల్పించే ఉద్దేశంతో ఈ ఆశ్రమం అభివృద్ధికి ఓ ట్రస్ట్ ప్రారంభించారు. బాపూ అనాసక్తి యోగా చేశారు కాబట్టి అదే పేరును ఈ ఆశ్రమానికి పెట్టారు.
-అనాసక్తి ఆశ్రమ ప్రతినిధి
గాంధీజీకి సంబంధించిన 15 వందల పుస్తకాలు, 150 ఛాయచిత్రాలు కలిగిన అనాసక్తి ఆశ్రమం ఆధునికీకరణ పనులు పురోగతిలో ఉన్నాయి. రూ. 3 కోట్ల రూపాయలతో తొలిదశ పనులు ప్రారంభమయ్యాయి.
ఇదీ చూడండి:రాజస్థాన్‌లో భారీ వర్షాలు.. ఐదుగురు మృతి