భోపాల్ లోక్‌సభ భాజపా అభ్యర్థి, మాలేగావ్ పేలుళ్ల కేసు నిందితురాలు సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌కు మరోమారు షోకాజ్ నోటీసు జారీ చేసింది ఎన్నికల సంఘం. ఓ టీవీ కార్యక్రమంలో బాబ్రి మసీద్ ఘటనలో భాగస్వామినైనందుకు సంతోషంగా ఉందన్న ప్రజ్ఞా సింగ్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించింది ఈసీ. ఎన్నికల ప్రవర్తనా నియమావళిలోని చాప్టర్ 4ను ఉల్లంఘించినట్లు తెలిపింది.
భోపాల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుదమ్ ఖేద్ శనివారం రాత్రి ప్రజ్ఞా సింగ్‌కు నోటీసు జారీ చేశారు. నియమావళి ఉల్లంఘనపై 24 గంటల్లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
నోటీసుపై స్పందించిన ప్రజ్ఞా సింగ్ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. చట్టప్రకారమే ప్రత్యుత్తరం ఇస్తానని పేర్కొన్నారు.
ముంబయి ఉగ్రదాడిలో మరణించిన పోలీసు అధికారి హేమంత్ కర్కరేపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ప్రజ్ఞా సింగ్‌కు గత శనివారం మొదటి సారి నోటీసులు ఇచ్చింది ఎన్నికల సంఘం.
ఇదీ చూడండీ: 'ఉగ్రవాదాన్ని రూపుమాపే ప్రభుత్వాన్ని ఎన్నుకోండి'