దిల్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని భాజపా పట్టుదలగా ఉంది. ఇప్పటికే ప్రచార కార్యక్రమాల్లో దూసుకుపోతుంది. నేడు లక్షమంది పార్టీ కార్యకర్తలతో భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని ఆరంభించనుంది. ఇందులో భాగంగా 70 నియోజకవర్గాల్లోని మొత్తం 13,750 పోలింగ్ కేంద్రాలలో ఈ ప్రచారాన్ని నిర్వహించనున్నారు.
ఆరంభించనున్న షా, నడ్డా...
హోంమంత్రి అమిత్ షా.. దిల్లీ కాంట్లో లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా.. గ్రేటర్ కైలాశ్, కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్.. ఆదర్శ్ ప్రాంతాల్లో ఈ ప్రచారాన్ని ప్రారంభిస్తారు. పార్టీ సీనియర్ నాయకులు, కేంద్ర మంత్రులతో సహా ఆపార్టీ ఎంపీలు ఇందులో పాల్గొననున్నారు.
ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా హస్తినలో కేంద్రం చేసిన అభివృద్ధి పనులను ప్రజల దృష్టికి తీసుకెళ్లనుంది భాజపా. కేంద్రం తీసుకొచ్చిన పథకాలు, సాధించిన లక్ష్యాలను గురించి ఇంటింటికి వెళ్లి కార్యకర్తలు వివరించనున్నారు.
కేంద్రంలో 'హై'... దిల్లీలో నై!
దిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 8న పోలింగ్ జరగనుండగా, 11న ఫలితాలు వెలువడనున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా రెండు దశాబ్దాలుగా దిల్లీలో మాత్రం అధికారాన్ని చేజిక్కించుకోలేకపోతోంది. 2015 ఎన్నికల్లో ఆప్ అధికారంలోకి రాగా, భాజపా కేవలం మూడు స్థానాలకే పరిమితమైంది.
ఇదీ చదవండి: భార్యను చంపి జాతీయ గీతం పాడిన భర్త!