"తృణమూల్ కాంగ్రెస్కు మమతా బెనర్జీ... మరి భాజపాకు ఎవరు?"... బంగాల్ రాజకీయాల్లో ప్రస్తుతం చర్చనీయాంశమైన ప్రశ్న ఇది. 2021 శాసనసభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సాగుతున్న కమలదళానికి సారథి ఎవరన్నదానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్టీలోని సీనియర్ నేతల బలాబలాలు, వారికి ఉన్న అవకాశాలపై విశ్లేషణలు జరుగుతున్నాయి. అయితే... వీటన్నింటికీ భిన్నంగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండా బరిలోకి దిగాలని భావిస్తోంది భారతీయ జనతా పార్టీ.
దీదీ వర్సెస్ మోదీ!
దేశంలోని బలమైన ప్రాంతీయ పార్టీల్లో టీఎంసీ ఒకటి. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మంచి ప్రజాదరణ ఉన్న నాయకురాలు. సారథి ఎవరో ప్రకటించకుండా అలాంటి ప్రత్యర్థిని ఎదుర్కోవడం భాజపాకు సాధ్యమేనా? ఔననే అంటోంది కమలదళం. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాకర్షణ శక్తి, కేంద్ర ప్రభుత్వ పథకాలు, టీఎంసీ పాలనా వైఫల్యాలే ఆయుధాలుగా ఎన్నికలకు వెళ్తున్నట్లు చెబుతోంది భాజపా.
"ప్రస్తుతం మేము మా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించదల్చుకోలేదు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధిస్తాం. అధికారంలోకి వచ్చాక కేంద్ర నాయకత్వమే ముఖ్యమంత్రిని ఎంపిక చేస్తుంది. 294 అసెంబ్లీ సీట్లలో 220-230 సీట్లు గెలుచుకోవడమే మా లక్ష్యం."
-కైలాష్ విజయ వర్గియా, భాజపా సీనియర్ నేత
2016లోనూ ఇలాగే..
2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే భాజపా పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో మూడు చోట్ల గెలుపొంది.. టీఎంసీ, కాంగ్రెస్, సీపీఎం తర్వాత స్థానంలో నిలిచింది. అయితే అంతకుముందు జరిగిన ఎన్నికల్లో బోణీ కొట్టని భాజపా ఈ సారి మూడు సీట్లను కైవసం చేసుకోవడం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.
గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా అనూహ్యంగా 18 ఎంపీ సీట్లను కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది భాజపా. ఏకంగా 41శాతం ఓట్లు సంపాదించి.. అధికార టీఎంసీకే కాకుండా రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. ఈ ఘనత సాధించడానికి మోదీ చరిష్మానే కారణంగా పార్టీ కేంద్ర నాయకత్వం భావించింది. అందుకే ఈ ఎన్నికల్లోనూ మోదీ మంత్రాన్నే నమ్ముకుని ముందుకు సాగుతోంది.
ముందుగానే సీఎం అభ్యర్థిని ప్రకటించడం వల్ల లాభాలు ఉన్నప్పటికీ భాజపా అలా అలోచించడం లేదు. టీఎంసీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విజయం సాధించాలనుకున్నట్లు భాజపా సీనియర్ నాయకుడు చెప్పుకొచ్చారు. "ప్రభుత్వ పనితీరే ఎన్నికల్లో గెలుపు, ఓటములను నిర్దేశిస్తుంది. 1977 ఎన్నికల్లో సీపీఎం గెలిచినా, 2011లో అదే పార్టీ ఓడినా కారణం. 2021 ఎన్నికల్లోనూ అలాంటి పరిస్థితే పునరావృతం అవుతుందని ఆశిస్తున్నాం. మోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధినే మేము ప్రజల్లోకి తీసుకెళ్తాము" అని అన్నారు పేరు చెప్పేందుకు ఇష్టపడని ఆ నేత.
ఆ రాష్ట్రాల్లోనూ ఇదే వ్యూహంతో...
సీఎం అభ్యర్థిని ప్రకటించకుండా ఎన్నికలకు వెళ్లడం భాజపాకు కొత్తేమీ కాదు. గతంలో మహారాష్ట్ర, మణిపుర్, త్రిపుర, ఉత్తర్ప్రదేశ్ ఎన్నికల్లోనూ ఇలాగే పోటీ చేసి మంచి ఫలితాలను సాధించింది.
"రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో జరిగే ఏ ఎన్నికైనా అభ్యర్థి ముఖ్యం కాదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడే ఓట్లే కీలకంగా మారతాయి."
-విశ్వనాథ్ చక్రవర్తి, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు
ఆశావహులు వీరే..
బంగాల్‌లో సీఎం అభ్యర్థిని భాజపా ప్రకటించకపోయినా.. కొందరు ఆశావహులు పేర్లు మాత్రం ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
దిలీప్ ఘోష్: ప్రస్తుతం ఆయన ఎంపీగా ఉన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పార్టీ అభివృద్ధికి తీవ్రంగా కృషి చేశారని పేరుంది. ఆయనకు బలమైన ఆర్ఎస్ఎస్ నేపథ్యం కూడా ఉంది.
స్వపన్ దాస్ గుప్తా: సీఎం అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.
తథాగత్ రాయ్: గవర్నర్గా పనిచేసిన రాయ్ పదవీ కాలం పూర్తయ్యాక మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. గతంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు.
ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై ఘోష్ స్పందిస్తూ.. "టీఎంసీ తరహాలో బంగాల్‌లో భాజపా ఏక వ్యక్తి నాయకత్వంలో పనిచేయదు" అని వ్యాఖ్యానించారు.
అలా అయితే గెలుపు కష్టం..
సీఎం అభ్యర్థి ఎవరో ప్రకటించకుండా బంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, మమతా బెనర్జీ లాంటి బలమైన పార్టీని, నేతను ఎదుర్కోవడం కష్టమని టీఎంసీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.
"ప్రతిపక్షంలో ఉన్నా.. అధికార పార్టీలో ఉన్నా బంగాల్ ఎప్పుడూ విశ్వసనీయ నాయకుడికే ఓటు వేసింది. బీసీ రాయ్, సిద్ధార్థ శంకర్ రాయ్, జ్యోతి బసు, బుద్ధదేవ్ భట్టాచార్య నుంచి మమతా బెనర్జీ వరకు అదే ధోరణి కొనసాగుతోంది. మమతకు సమానమైన నాయకుడు భాజపాలో లేరు. ఫలితంగా మాకు లాభం కలుగుతుంది."
-సౌగతా రాయ్, టీఎంసీ ఎంపీ
భాజపా వ్యూహం ఎంత మేర ఫలిస్తుందో, బంగాల్ రాజకీయం ఎలాంటి మలుపు తిరుగుతుందో తెలియాలంటే 2021 ఎన్నికలు అయ్యే వరకు వేచి చూాడాల్సిందే.