1984 నాటి సిక్కు అల్లర్లకు సంబంధించి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ సలహాను నాటి హోంమంత్రి పీవీ నరసింహారావు పాటించి ఉంటే.. సిక్కుల ఊచకోత జరిగి ఉండేది కాదన్న మన్మోహన్ వ్యాఖ్యలను భాజపా ఖండించింది. సిక్కు అల్లర్లకు రాజీవ్ గాంధీనే కారణమని ఎదురుదాడి చేసింది. ఒకవేళ నరసింహారావు చెడ్డ నేత అయితే.. 1991లో కేంద్ర ఆర్థికమంత్రిగా మన్మోహన్ను ఎందుకు నియమించుకుంటారని ఎదురు ప్రశ్నించారు కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్. రాజీవ్ గాంధీ మద్దతుతోనే ఈ మారణ హోమం జరిగిందని ఆరోపించారు.
సలహా పాటించి ఉంటే..
గుజ్రాల్ శత జయంతి సందర్భంగా దిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ఉప రాష్ట్రపతి అన్సారీ, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, జైశంకర్ తదితరులతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ సలహాను నాటి హోంమంత్రి పీవీ నరహింహారావు పాటించనందుకే 1984లో సిక్కు అల్లర్లు జరిగాయని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మన్మోహన్.
అల్లర్లు జరిగినరోజు అప్పటి హోంమంత్రి పీవీ నరసింహారావు ఇంటికి వెళ్లి.... పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని, వెంటనే సైన్యాన్ని రంగంలోకి దించాలని పీవీకి గుజ్రాల్ సూచించినట్లు మన్మోహన్ చెప్పారు. పీవీ ఆ పని చేసి ఉంటే అల్లర్లు జరిగి ఉండేవే కావన్నారు. గుజ్రాల్, తానూ ఒకే గ్రామంలో జన్మించామన్న మన్మోహన్‌సింగ్.. రాజకీయాల్లోనూ చాలా ఏళ్లు కలిసి పనిచేసినట్లు తెలిపారు.
ఇదీ చూడండి : అత్యాచార బాధితురాలికి నిప్పు అంటించిన రాక్షసులు