మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం విషయంలో శివసేన వెనక్కు తగ్గేది లేదని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందే భాజపా, శివసేన మధ్య ఈ విషయంలో ఓ ఒప్పందం కుదిరిందని, ఇప్పుడు మరో ప్రతిపాదనకు అవకాశం లేదని ఆయన తేల్చిచెప్పారు.
''మళ్లీ ఇంత వరకు కొత్త ప్రతిపాదనలేమీ జరగలేదు. ఎన్నికల ముందు మాత్రమే కూటమి మధ్య చర్చలు జరిగాయి. కానీ.. ఇప్పుడు జరుగుతుందేంటో చూస్తున్నారుగా. కూటమి ఏర్పడింది. రోజుకో కొత్త ప్రతిపాదన, ఆఫర్లు అంటున్నారు. ఇలాంటి వాటి కోసం ఎదురుచూడటం వల్ల సమయమే వృథా అవుతోంది. రాష్ట్రపతి పాలన విధించాలనుకోవడం.. రాష్ట్ర ప్రజల అభిప్రాయాన్ని అవమానించడమే.''
- సంజయ్ రౌత్, శివసేన నేత
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా, శివసేన కూటమి 288కి గానూ.. 161 సీట్లు సాధించింది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 145 సీట్లు ఉంటే చాలు. అయితే ముఖ్యమంత్రి పదవి విషయంలో ఇరుపార్టీల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఫలితంగా ఎన్నికల ఫలితాలు వెలువడి 13 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం ఏర్పడలేదు.
ప్రతిష్టంభన కొనసాగుతున్న తరుణంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో భేటీ అయ్యారు శివసేన నేత సంజయ్ రౌత్. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు భాజపా తన ప్రయత్నాలనూ ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి ఫడణవీస్.. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్‌తో సమావేశమయ్యారు. ఇంకా కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్.. కేంద్ర మంత్రి, భాజపా నేత నితిన్ గడ్కరీని కలిశారు. అయితే.. గడ్కరీతో రైతు సమస్యలను మాత్రమే ప్రస్తావించినట్లు పేర్కొన్నారు పటేల్.
ఇదీ చూడండి: హెచ్1బీ వీసాల తిరస్కరణలో భారత కంపెనీలే ఎక్కువ