కర్ణాటక రాజకీయ సంక్షోభంపై అనిశ్చితి వీడేలా ఉంది. సోమవారం జరిగిన నాటకీయ పరిణామాలు.. సంకీర్ణ సర్కారు భవితవ్యంపై ఉత్కంఠను మరింత పెంచాయి. సుప్రీంతో పాటు స్పీకర్ నిర్ణయంపైనే కన్నడ రాజకీయాలు ఆధారపడి ఉన్నాయి.
నేడు సోమవారం కర్ణాటక శాసనసభ సమావేశాల ప్రారంభానికి ముందు బీఏసీ సమావేశమైంది. బలపరీక్ష కోసం ఒత్తిడి తెచ్చింది భాజపా. సుప్రీం కోర్టు విచారణ తర్వాత.. నిర్ణయం తీసుకుందామని సభ్యులకు సూచించారు స్పీకర్. అయితే.. ఎంతకూ తగ్గని కాషాయ పార్టీ.. అవిశ్వాస తీర్మాన నోటీసును స్పీకర్‌కు అందించింది. చివరకు.. ఈ నెల 18న సీఎం విశ్వాస పరీక్ష ఎదుర్కోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు సభాపతి. అనంతరం.. కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత సిద్ధరామయ్య దీనిపై స్పష్టతనిచ్చారు. 18న ఉదయం 11 గంటలకు విశ్వాస పరీక్షపై చర్చ ప్రారంభమవుతుందని వెల్లడించారు.
సుప్రీంలో రేపే విచారణ...
కర్ణాటకలో ఇప్పటికే 16 మంది ఎమ్మెల్యేలు శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. వీరిలో ఇదివరకు 10 మంది ఎమ్మెల్యేలు.. స్పీకర్ తమ రాజీనామాల్ని ఆమోదించేలా ఆదేశించాలని సుప్రీంను ఆశ్రయించారు. అనంతరం.. మరో ఐదుగురు అదే బాట పట్టారు. వీరి పిటిషన్లపై మంగళవారం వాదనలు విననుంది అత్యున్నత న్యాయస్థానం.
16 మందిలో కాంగ్రెస్ నుంచి 13, జేడీఎస్ నుంచి ముగ్గురు శాసనసభ్యులున్నారు. మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు శంకర్, నగేశ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు.
స్పీకర్‌తో కలిపి సంకీర్ణ ప్రభుత్వం బలం 116గా ఉంది. (కాంగ్రెస్-78, జేడీఎస్-37, బీఎస్పీ-1)
16 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదిస్తే మాత్రం బలం 100కు పడిపోనుంది.
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నిర్ణయం ఎలా ఉంటుంది..? విశ్వాస పరీక్ష ఉంటుందా..? తదనంతర పరిణామాలు ఎలా ఉంటాయని సర్వత్రా ఆసక్తి నెలకొంది. సుప్రీం తీర్పు ఎలా ఉన్నప్పటికీ.. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఉత్కంఠ కలిగిస్తోంది.
బుజ్జగింపుల ఫలితం శూన్యం!
18న బలనిరూపణ నేపథ్యంలో ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో పడ్డాయి ఇరు పక్షాలు. శిబిర రాజకీయాలు మళ్లీ జోరందుకున్నాయి. ఆయా పార్టీలు.. తమ ఎమ్మెల్యేలను పటిష్ఠ భద్రత నడుమ శిబిరాలకు తరలిస్తున్నాయి. అసమ్మతి ఎమ్మెల్యేలను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్-జేడీఎస్‌కు ఫలితాలు మాత్రం ప్రతికూలంగానే వస్తున్నాయి.
ఇదీ చూడండి: