బిహార్ శాసనసభ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో.. 46 మంది అభ్యర్థులతో మరో జాబితా విడుదల చేసింది భారతీయ జనతా పార్టీ. మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రా తనయుడు నితీశ్ మిశ్రా, ప్రస్తుత మంత్రి నందకిషోర్ యాదవ్ సహా 46మందికి టికెట్ కేటాయించింది. వారు రెండో విడత పోలింగ్ జరగనున్న నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నారు.
ఇప్పటివరకు 75 స్థానాలకు భాజపా తన అభ్యర్థుల్ని ప్రకటించింది. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ శనివారం భేటీ అయి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరిపింది.
ప్రచారానికి ప్రముఖులు
30మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది భాజపా. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా ఇతర ముఖ్య నేతలు ఉన్నారు.
బిహార్ ఎన్నికలు మూడు దశలుగా ఈ నెల 28, నవంబర్ 3, 7వ తేదీల్లో జరగనున్నాయి. నవంబర్ 10న ఫలితాలు వెలువడనున్నాయి. జేడీయూతో కలిసి బరిలో దిగనున్న భాజపా.. 243 సీట్లకు గానూ 110 స్థానాల్లో పోటీ చేయనుంది.
ఇదీ చూడండి:- 'నితీశ్ చేతుల్లోనే బిహార్ క్షేమం'