బడ్జెట్ సమావేశాల సందర్భంగా జులై 2న భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక మొదటి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. బిల్లుల ఆమోదం, ఇటీవల ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను ఎంపీలకు మోదీ తెలపనున్నారని సమాచారం.
జీ-20 సదస్సులో పాల్గొని స్వదేశానికి చేరుకున్న ప్రధానికి ఈ సమావేశం వేదికగా ఎంపీలు ఘన సన్మానం చేయనున్నారని తెలుస్తోంది.
భాజపా సీనియర్ నేతలు ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషిలు లేకుండా ఆ పార్టీ పార్లమెంటరీ సమావేశం జరగడం ఇదే తొలిసారి. 75 ఏళ్లు పైబడిన నేతలు ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న పార్టీ నిబంధనతో వీరిద్దరు ఎన్నికల బరిలో నిలబడలేదు.
భాజపా పార్లమెంటరీ పార్టీ తొలి సమావేశం జూన్ 25నే జరగాల్సి ఉంది. భాజపా రాజస్థాన్ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు మదన్ లాల్ సైనీ మృతితో వాయిదా పడింది.
ఇదీ చూడండి: మన్ కీ బాత్ 2.0: ప్రజా ఉద్యమంలా జల సంరక్షణ