ఎవరైనా గుడిలో దేవుడిని సుఃఖసంతోషాలు, సిరిసంపదలు ప్రసాదించాలని కోరుకుంటారు. కొందరైతే తన చుట్టూ ఉన్నవారంతా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తారు. కానీ... రాజస్థాన్లోని ఓ శాసనసభ్యుడు మాత్రం అందుకు పూర్తి భిన్నమైన ప్రార్థనతో నెట్టింట వైరల్ అయ్యారు.
"ఓ దేవుడా... ప్లాస్టిక్ గ్లాసుల్లో టీ తాగేవారికి, పరిసరాలను అపరిశుభ్రంగా చేసేవారికి అనారోగ్యం ప్రసాదించు. వారి ఇంట్లో ఎవరో ఒకరికి చెయ్యో, కాలో విరిగేలా చూడు. వారికి నష్టం కలిగించు. వారి ఇంటికి అసలు డబ్బు రాకుండా చెయ్యి. అపరిశుభ్రతకు తావులేకుండా అందరూ సుఃఖంగా ఉండేందుకు నేను చేస్తున్న ప్రార్థన ఇదే."
-మదన్ దిలావర్, భాజపా శాసనసభ్యుడు
స్వచ్ఛ భారత్, ప్లాస్టిక్ వాడడం మానేయడంపై ప్రధాని నరేంద్రమోదీ ఆకాంక్ష నెరవేర్చేందుకు కొంతకాలంగా తనదైన శైలిలో ప్రయత్నిస్తున్నారు రామ్గంజ్మండి భాజపా ఎమ్మెల్యే మదన్ దిలావర్. ప్లాస్టిక్ వాడేవారిని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోనివాళ్లను బెదిరించటం, భయపెట్టడం వంటివి చేసేవారు. ఇప్పుడు మరో ముందడుగు వేసి ఇలా వినూత్న ప్రార్థన చేశారు.
గతంలో తాను పొరపాటున ప్లాస్టిక్ వాడినందుకు తనకు తానే రూ.5 వేలు జరిమానా విధించుకొన్నారు దిలావర్. కలెక్టర్కు పరిహారం చెల్లించారు. ఈ విషయమూ అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
ఇదీ చూడండి : శ్రీమహాలక్ష్మి అమ్మవారికి 16కేజీల పసిడి చీరతో అలంకరణ