భాజపాకు వరుసగా రెండోసారి స్పష్టమైన మెజారిటీతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా అద్భుత విజయాన్ని అందించారు ప్రజలు. ఈ గెలుపు కమలం పార్టీలో నూతనోత్సాహాన్ని నింపింది. తూర్పు రాష్ట్రాల్లో 50శాతానికిపైగా సీట్లు కైవసం చేసుకుని అఖండ విజయం సాధించిన భాజపా.. కర్ణాటక మినహా దక్షిణాది రాష్ట్రాల్లో సత్తా చాటలేకపోయింది. కేరళ, తమిళనాడులో ఖాతా తెరవలేదు. తదుపరి రాజకీయ ప్రణాళికలో భాగంగా దక్షిణాది రాష్ట్రాల్లో పాగా కోసం వ్యూహ రచన చేయాలని భావిస్తోంది భాజపా.
అమిత్‌షాకు కీలక పదవి?
గాంధీనగర్ లోక్‌సభ స్థానం నుంచి నూతనంగా ఎన్నికైన భాజపా అధ్యక్షుడు అమిత్‌షాకు మోదీ నేతృత్వంలో కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వంలో కీలక పదవి అప్పగించే అవకాశలున్నాయని పార్టీ వర్గాల సమాచారం.
100లక్షల కోట్ల పెట్టుబడులు..
గెలుపుపై ధీమాతో అవస్థాపన రంగంలో రూ.100 లక్షల కోట్లు, వ్యవసాయ-గ్రామీణ విభాగంలో రూ. 25లక్షల కోట్ల మూలధన పెట్టుబడులకు తీర్మానానికి మంగళవారం ఆమోదం తెలిపింది ఎన్డీఏ. అంకుర సంస్థలకు ప్రపంచంలోనే అనువైన కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్ది, 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ గల దేశంగా అవతరించేందుకు కార్యచరణ రూపొందించాలని భావిస్తున్నట్లు తెలిపింది.
ముమ్మారు తలాక్ బిల్లు, పౌరసత్వ సవరణ బిల్లులు పార్లమెంటులో ఆమోదం పొందేందుకు కృషి చేయాలని భాజపా భావిస్తోంది.
పార్లమెంటరీ బోర్డు సమావేశం
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ, ప్రజలకు ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి భాజపా పార్లమెంటరీ బోర్డు ఆమోదం తెలిపింది. నూతనంగా ఎన్నికైన ఎంపీలతో శనివారం భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశం కానుంది. మోదీని తమ నాయకునిగా ఎన్నుకోనున్నారు కొత్త ఎంపీలు. అనంతరం నూతన ప్రభుత్వ ఏర్పాటుపై రాష్ట్రపతిని కలుస్తారు. వీటన్నింటి తర్వాత కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారం జరుగుతుందని పార్లీ వర్గాలు తెలిపాయి.
జాతీయవాదం, దేశభద్రత, హిందుత్వమే ప్రధాన అంశాలు ప్రచారం నిర్వహించి ఓటర్ల విశ్వాసం చూరగొని వరుసగా రెండోసారి ఘన విజయం సాధించారు ప్రధాని నరేంద్ర మోదీ.
ఇదీ చూడండి: 'తీర్పును గౌరవిస్తున్నాం- కార్యకర్తలు అధైర్యపడొద్దు'