మణిపుర్ అసెంబ్లీలో నిర్వహించిన విశ్వాసపరీక్షలో అధికార భాజపా సంకీర్ణ ప్రభుత్వమే నెగ్గింది. 28-16 ఓట్ల తేడాతో సీఎం బీరెన్ సింగ్ విజయం సాధించారు. మూజువాణి పద్ధతిలో స్పీకర్ ఓటింగ్ నిర్వహించారు.
ఫలితాల అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభలో రచ్చ చేశారు. తాము ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించి.. అధికార పక్ష విశ్వాస తీర్మానాన్ని స్పీకర్ ఆమోదించారని సభలో కుర్చీలు విసిరి గందరగోళం సృష్టించారు.
విశ్వాస పరీక్షలో తాము నెగ్గామని, నిబంధనల ప్రకారమే స్పీకర్ వ్యవహరించారని ఓటింగ్ అనంతరం సీఎం బీరెన్ సింగ్ చెప్పారు. కాంగ్రెస్కు సంఖ్యాబలం లేదని పేర్కొన్నారు.
మణిపుర్ అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలున్నాయి. భాజపా సంకీర్ణ ప్రభుత్వానికి 28 మంది సభ్యుల మద్దతు ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మొత్తం 24 మంది కాగా.. 16మంది మాత్రమే ఓటింగ్లో పాల్గొన్నారు. మరో ఆరుగురు రాజీనామా చేశారు.