రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా ప్రయత్నిస్తోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఆరోపించారు. కరోనా మహమ్మారి ప్రబలుతున్న సమయంలోనూ భాజపా.. మానవత్వాన్ని విస్మరించిందని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేలకు డబ్బు ఎరగా చూపి ప్రభుత్వాన్ని కూలదోయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.
రాజస్థాన్లోనూ మధ్యప్రదేశ్ తరహా రాజకీయ క్రీడలు ఆడాలని భాజపా కోరుకుంటోందని విమర్శించారు గహ్లోత్. కానీ ప్రజలంతా గమనిస్తున్నారని.. సరైన సమయంలో భాజపాకు గట్టిగా బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.
"భాజపా నేతలు సిగ్గులేని పరిమితిని ఎప్పుడో దాటేశారు. అది సతీష్ పూనియా కావచ్చు, రాజేంద్ర రాఠోడ్ కావచ్చు. పార్టీ కేంద్ర నాయకత్వం ఆదేశాల ప్రకారం ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఆటలాడుతున్నారు. ముందుగా రూ. 10 కోట్లు, ప్రభుత్వం పడిపోయాక రూ. 15 కోట్లు అంటూ బేరాలు ఆడుతున్నారు. రాష్ట్రంలో 'మేకల సంత' రాజకీయాలు చేస్తున్నారు. కరోనా సంక్షోభం ఉన్నప్పటికీ మానవత్వాన్ని లెక్కచేయకుండా ప్రభుత్వాన్ని కూలదోయడంలో నిమగ్నమయ్యారు."
-అశోక్ గహ్లోత్, రాజస్థాన్ ముఖ్యమంత్రి
అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పటిష్ఠంగా ఉందని పేర్కొన్నారు సీఎం. తమ ప్రభుత్వం ఐదేళ్ల పాలన పూర్తి చేసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి- 'కరోనాపై పోరులో అన్ని రాష్ట్రాలకు దిల్లీనే ఆదర్శం'