భారతీయ జనతా పార్టీ(భాజపా) సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి కిరణ్ మహేశ్వరి కరోనాతో మృతిచెందారు. రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మహేశ్వరి.. ఈ నెల 28న కొవిడ్-19 బారినపడ్డారు. హరియాణాలోని మెదంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. కిరణ్ మృతిపై పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
1961 అక్టోబర్ 29న జన్మించిన మహేశ్వరి.. భాజపా తరఫున ఎమ్మెల్యే, ఎంపీగా సేవలందించారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో రాజస్థాన్ రాష్ట్ర కేబినెట్ మంత్రిగానూ పనిచేశారు మహేశ్వరి.
ప్రధాని సంతాపం
ఎమ్మెల్యే కిరణ్ మహేశ్వరి మృతిపై ఆమె కుటుంబానికి సంతాపం తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. మహేశ్వరి అకాల మరణంతో దిగ్భ్రాంతి చెందినట్టు చెప్పిన ఆయన.. రాష్ట్ర ప్రగతి కోసం, అట్టడుగు స్థాయి వర్గాల కోసం ఆమె ఎనలేని కృషి చేశారని ట్వీట్ చేశారు.
197కు పడిపోయిన ఎమ్మెల్యేల సంఖ్య
కిరణ్ మహేశ్వరి మరణంతో 200 మందితో కూడిన రాజస్థాన్ శాసనసభ్యుల సంఖ్య 197కు తగ్గింది. అంతకుముందు ఎమ్మెల్యే కైలాశ్ త్రివేది, మంత్రి మాస్టర్ భన్వర్‌లాల్ మేఘవాల్ కూడా మృతిచెందారు.
ఇదీ చదవండి: శివసేనలోకి ఊర్మిళ.. చేరిక ఎప్పుడంటే?