ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే మహేశ్ నేగి భార్య పోలీసులకు సంచలన లేఖ రాశారు. భర్త నేగి సహా, ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్న మహిళకు నార్కో అనాలసిస్ పరీక్ష చేసి నిజానిజాలు తేల్చాలని కోరారు.
"ఎమ్మెల్యే సహా బాధితురాలికి నార్కో పరీక్షలు నిర్వహించాలని కోరుతూ నేగి భార్య లేఖ రాశారు. అయితే, బాధితురాలి భర్త వాదనలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే, మహిళా శిశు సంక్షేమ కమిషన్ నుంచి లేఖ అందింది. ఈ కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నాం. "
-అంజు కుమార్, డీఎస్పీ
ఇటీవల భాజపా ఎమ్మెల్యే నేగి రెండేళ్లపాటు తనను లైంగికంగా వేధించారని ఓ మహిళ ఆరోపించింది. తన కూతురి డీఎన్ఏ తన భర్త జన్యువులతో కాక ఎమ్మెల్యే డీఎన్ఏతో పోలీ ఉంటుందని పేర్కొంది.
అయితే, బాధితురాలి ఆరోపణలను ఉత్తరాఖండ్ పోలీసులు పట్టించుకోవట్లేదని రాష్ట్రంలో భారీ ఎత్తున నిరసనలు చేపట్టింది ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో నిద్రావస్థలోకి పంపించి నిజాలు రాబట్టేందుకు ఉపయోగించే... నార్కో అనాలసిస్ పద్ధతిని భర్తపై, బాధితురాలిపై ప్రయోగించాలని నేగి భార్య కోరడం గమనార్హం.
ఇదీ చదవండి: 'అంత తొందరేంటి... ఆకాశం ఊడిపడుతోందా?'