'రథయాత్ర'కు అనుమతులు మంజూరు చేయలేదని తమ ప్రభుత్వంపై భాజపా దుష్ప్రచారం చేస్తోందని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ధ్వజమెత్తింది. ఇలాంటి చర్యలతో భాజపా సానుభూతి పొందాలని యత్నిస్తోందని విమర్శించింది. భాజపా చేపట్టిన ఈ కార్యక్రమానికి బంగాల్ ప్రభుత్వం అనుమతులు నిరాకరించలేదని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేసింది. దానివల్ల తమ పార్టీకి ఎలాంటి నష్టం కలగబోదని పేర్కొంది.
"భాజపా చెబుతున్నట్లుగా... ఏ యాత్రకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు నిరాకరించలేదు. దురుద్దేశంతో వాళ్లు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. యాత్రకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు నిరాకరించిందన్న విషయం నిజమే అయితే.. అందుకు తగిన ఆధారాలు భాజపా సమర్పించాలి. ఇలాంటి చర్యలతో సానుభూతి పొందాలని ఆ పార్టీ యత్నిస్తోంది. రథయాత్రకు సంబంధించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నుంచి భాజపా అనుమతులు తీసుకుంది. దీనికి సంబంధించి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలైంది. ప్రస్తుతం ఆ అంశం సబ్ జుడీస్ పరిధిలో ఉంది. దీనిపై తీర్పు వచ్చిన తర్వాత మా పార్టీకి దీనికి ఎలాంటి సంబంధం లేదని అందరికీ స్పష్టమవుతుంది.
-తృణమూల్ కాంగ్రెస్
రథయాత్ర విషయంలో కోర్టు జోక్యం చేసుకోవాలని కోరుతూ.. బుధవారం కోల్కతా హైకోర్టులో ఓ పిల్ దాఖలైంది. కొవిడ్ పరిస్థితులు, శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతుందని ఆ వ్యాజ్యంలో పిటిషనర్ పేర్కొన్నారు.
విజయవంతంగా జరుపుతాం...
ఎన్నికల్లో ప్రజలకు చేరువయ్యేందుకు చేపట్టిన ఈ రథయాత్ర కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు టీఎంసీ యత్నిస్తోందని బంగాల్ భాజపా అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఆరోపించారు. ఎన్ని రకాలుగా యత్నించినా తాము ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తామని అన్నారు.