కరోనా మహమ్మారి కారణంగా.. ఆకలితో అలమటిస్తున్న వారికి అండగా నిలవాలని భాజపా కార్యకర్తలకు సూచించారు ప్రధాని నరేంద్ర మోదీ. భాజపా 40వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని.. కార్యకర్తలు, వ్యవస్థాపకులు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ స్థాపనకు కృషి చేసిన ఎందరో గొప్ప నేతలను ఆయన ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
వారి గొప్ప పోరాట ఫలితాల కారణంగానే ఈ రోజు కోట్లాది భారతీయులకు సేవచేసే అవకాశం భాజపాకు లభించిందన్నారు మోదీ. దేశానికి సేవచేసే అవకాశం వచ్చినప్పుడల్లా గొప్పగా పాలించామని, పేదల సాధికారత కోసం కృషి చేశామని అన్నారు.
''పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా.. కార్యకర్తలంతా గొప్ప మార్పు కోసం పనిచేశారు. తమ సామాజిక సేవ ద్వారా ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపారు.''
- ట్విట్టర్లో ప్రధాని నరేంద్ర మోదీ.
కరోనా కట్టడిలో ప్రతి కార్యకర్త కీలకంగా వ్యవహరించాలని అన్నారు మోదీ. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా మార్గదర్శకాలను అనుసరించి అవసరంలో ఉన్న వారిని ఆదుకోవాలని సూచించారు. సామాజిక దూరం ప్రాధాన్యాన్ని పునరుద్ఘాటించాలన్నారు.
వారిని ఆదుకోండి..
పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. దిల్లీలోని తన నివాసంలో భాజపా జెండా ఎగురవేశారు అధ్యక్షుడు జేపీ నడ్డా. కరోనా విజృంభణతో ఆపదలో ఉన్నవారికి ఆహార పొట్లాలు అందించాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. క్లిష్ట సమయంలో గొప్ప సేవ చేస్తున్న అత్యవసర సిబ్బంది, ఆరోగ్య కార్తకర్తలు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులకు సంఘీభావంగా అందరి దగ్గర నుంచి సంతకాలు సేకరించాలని వారిని కోరారు.
ఇతర మార్గదర్శకాలు..
- ప్రతి కార్యకర్త.. ఇంట్లో తయారుచేసిన మాస్క్‌లను ఒక్కొక్కరికి రెండు చొప్పున పంచిపెట్టాలి.
- పీఎం కేర్స్ నిధికి ఒక్కొక్కరు రూ. 100 చొప్పున సహాయం చేసేలా 40 మందిని ప్రోత్సహించాలి.
- ఒక్కో కార్యకర్త 40 ఇళ్లకు వెళ్లి.. వారి నుంచి ధన్యవాదాలతో కూడిన సంతకాలు సేకరించాలి.
దేశప్రయోజనాల కోసమే...
భారతీయ జనతా పార్టీ తమ సిద్ధాంతాలకు అనుగుణంగా.. దేశ ప్రయోజనాల కోసమే పనిచేస్తుందని స్పష్టం చేశారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం పునర్నిర్మాణం దిశగా సాగుతుందన్నారు. భారత ప్రజాస్వామ్యానికి నిజమైన వారధి.. భాజపా అని ట్వీట్ చేశారు షా.
తొలి సారథి వాజ్‌పేయీ...
40 ఏళ్ల క్రితం 1980 ఏప్రిల్ 6వ తేదీన భాజపా ఆవిర్భవించింది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులుగా మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్‌పేయీ ఎన్నికయ్యారు.