2014 సార్వత్రిక ఎన్నికల్లో విజయఢంకా మోగించి.. కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి క్రమక్రమంగా దేశం మొత్తం విస్తరిస్తోంది భాజపా. ఆ దిశగానే ఆయా రాష్ట్రాల్లో పాతుకుపోయేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకు సాగింది. ఇంకా కొన్ని రాష్ట్రాల విషయంలో... 2014 సార్వత్రికం ముందు నుంచే కమలనాథులు వ్యూహాత్మకంగా ఉన్నారు. అలాంటి వాటిల్లో హరియాణా కూడా ఒకటి.
2013లో భాజపా పక్కా ప్రణాళికతో ముందుకెళ్లింది. కాంగ్రెస్‌లో అత్యంత సీనియర్ నాయకుడు రావ్ ఇంద్రజిత్సింగ్ను తమ పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా.. హస్తం పార్టీని కోలుకోలేని దెబ్బ తీసింది. రాష్ట్రంలో 7 సెగ్మెంట్లు ఉండే అహిర్వాల్ను చేజిక్కించుకునేందుకే కాషాయ పార్టీ ఈ వ్యూహాన్ని అమలు చేసింది. 2013లో నరేంద్రమోదీని భాజపా ఎన్నికల ప్రచారకమిటీ ఛైర్మన్‌గా నియమించిన తర్వాత.. రేవారిలో నిర్వహించిన మాజీ సైనికోద్యోగుల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.
ఇలా ప్రతి అంశంలోనూ సరైన దృక్పథంతో వ్యవహరించిన భాజపా.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అహిర్‌వాల్ ప్రాంతంపై జెండా ఎగురవేసింది. పూర్తిస్థాయిలో విజయం సొంతం చేసుకుంది. ఆ గెలుపు ఇచ్చిన ఉత్సాహంతోనే ఈ సారి జాట్ల ప్రాధాన్యం అధికంగా ఉండే... దేస్‌వాలీ ప్రాంతంపై పట్టు సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు కమలనాథులు. ఇక్కడ అనాదిగా భూపెత్తందారులైన జాట్ల రాజ్యమే నడుస్తోంది. ఖాప్ పంచాయతీల పాత్రా ఎక్కువే.
ఆపరేషన్ దేస్‌వాలీ...
2019 సార్వత్రికానికి చాలా ముందుగానే ఆపరేషన్ దేస్వాలీని.... పట్టాలెక్కించింది భాజపా. మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత భూపిందర్ సింగ్ హుడా ప్రాబల్యం అధికంగా ఉండే రోహ్తక్పై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ప్లాన్‌లో భాగంగానే 2017 ఆగస్టులో భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా 3 రోజుల పాటు రోహ్‌తక్‌లోనే ఉన్నారు.
రోహ్‌తక్, ఝజ్జార్, సోనీపట్ జిల్లాలు దేస్‌వాలీ ప్రాంతంలోకి వస్తుండగా.. ఇక్కడున్న 15 స్థానాల్లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ 10 చోట్ల విజయం సాధించింది. అయితే అనంతరం వ్యూహాత్మకంగా పావులు కదిపిన భాజపా 2019 లోక్‌సభ ఎన్నికల్లో భూపిందర్‌సింగ్ హుడా, ఆయన కుమారుడు దీపేందర్‌సింగ్ హుడాను రోహ్‌తక్, సోనీపట్ నియోజకవర్గాల్లో ఓడించింది.
జింద్ ఉపఎన్నికలో భారీ విజయం....
ఇటీవలి లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ ప్రాంతంలో జరిగిన 5 మేయర్ ఎన్నికల్లోనూ భాజపానే గెలిచింది. అనంతరం.. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జింద్ ఉపఎన్నికల్లోనూ సత్తా చాటింది. ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి రణ్‌దీప్ సుర్జేవాలాతో పాటు ఐఎన్ఎల్డీ నేత దుష్యంత్ చౌతాలాపై భాజపా అభ్యర్థి ఘనవిజయం సాధించారు.
హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ కూడా దేస్‌వాలీ ప్రాంతానికి చెందినవారే. మోదీ గత రెండేళ్ల వ్యవధిలో 3 అతిపెద్ద సమావేశాల్లో పాల్గొన్నారు. 2018 అక్టోబర్‌లో స్థానిక నేత చోటురామ్ విగ్రహావిష్కరణలో పాల్గొన్న మోదీ... ఆ తర్వాత రోహ్‌తక్ ప్రాంతంలో భారీ ఎన్నికల ర్యాలీ కూడా నిర్వహించారు.
75 ప్లస్ సీట్లే లక్ష్యంగా...
ఇక గత నెలలో 3 లక్షల మంది పన్నా ప్రముఖ్‌లతో నిర్వహించిన సమావేశానికి కూడా మోదీ హాజరై దిశా నిర్దేశం చేశారు. షా కూడా సమయం దొరికినప్పుడల్లా రోహ్‌తక్‌కు వెళ్లి వస్తున్నారు. చింతన్ శివార్స్ పేరిట అనేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే ముఖ్యమంత్రి ఖట్టర్ కూడా జన్ ఆశీర్వాద్ యాత్రను రోహ్‌తక్‌లోనే ముగించారు. ఈ ఎన్నికల ప్రచారంలోనూ దేస్‌వాలీ ప్రాంతంలో జరిగే సభల్లో మోదీ, షా పాల్గొనే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 90 సీట్లున్న హరియాణాలో 75 ప్లస్ సీట్ల సాధనే లక్ష్యంగా... కమలనాథులు ఆబ్కీ బార్ 75 పార్ నినాదంతో దూసుకెళ్తున్నారు.
దేస్‌వాలీ ప్రాంతంలో 2 లోక్‌సభ నియోజకవర్గాల్లో భాజపా పాగా వేయడం శ్రేణుల్లో నూతనోత్సాహం తీసుకొచ్చినట్లు స్థానిక నేతలు కూడా చెప్తున్నారు. ఇప్పటికే జీటీరోడ్ బెల్ట్, అహిర్‌వాల్ ప్రాంతంలో పూర్తిస్థాయిలో పట్టు సాధించిన భాజపా దేస్‌వాలీలోనూ బలోపేతమై ఆధిపత్యం సంపూర్ణం చేయాలన్న కృతనిశ్చయంతో అక్టోబర్ 21 ఎన్నికలకు సన్నద్ధం అవుతోంది.
ఇదీ చూడండి: హరియాణా పోరు: ఖట్టర్, హుడాల ప్రతిష్ఠకు సవాల్!