భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో.. ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. వివిధ రాష్ట్రాల్లో ఈ నెల 26న జరగనున్న రాజ్యసభ ఎన్నికలపై చర్చించింది.
ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా హాజరయ్యారు. ఇవాళ పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశముంది.
జ్యోతిరాదిత్య సింధియా.. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేయగా.. అదే రోజు భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగడం సర్వత్రా చర్చనీయాంశమైంది. సింధియా.. భాజపాలో చేరే అవకాశముందని.. ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చే యోచనలో పార్టీ అధిష్ఠానం ఉన్నట్టు తెలుస్తోంది.
మొత్తం 55 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 26న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ దాఖలు చేయడానికి 13 చివరి తేది.