కర్ణాటకలో ఉప ఎన్నికల రూపంలో ఎదురైన అగ్నిపరీక్షను భాజపా దిగ్విజయంగా ఎదుర్కొంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి.. 15 సీట్లలో 12 స్థానాలను కైవసం చేసుకుంది. తద్వారా యడియూరప్ప సర్కార్ శాసనసభలో స్పష్టమైన ఆధిక్యం సాధించి ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకుంది.
కుమారుస్వామి సర్కార్‌పై తిరుగుబాటు చేసి అనర్హతకు గురైన వారిలో 13 మందికి భాజపా టికెట్లు ఇవ్వగా.. 12 మంది విజయఢంకా మోగించడం విశేషం. ఈ విజయంతో భాజపా శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. సీఎం యడియూరప్ప.. తన కుమారుడితో పాటు పార్టీ నేతలకు మిఠాయిలు తినిపించారు.
ప్రజా తీర్పు సంతోషకరంగా ఉంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మూడురన్నరేళ్లు సుస్థిర ప్రభుత్వాన్ని అందించేందుకు అవకాశం ఇచ్చారు. ప్రజానుకూల ప్రభుత్వాన్ని అందిస్తాం. వచ్చే ఎన్నికల్లో 150 స్థానాలు లక్ష్యంగా పెట్టుకున్నా. అందుకోసం మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి నా వంతు ప్రయత్నం చేస్తా. 2,3 రోజుల్లో దిల్లీ వెళ్తా. మాకు మద్దతు ఇచ్చిన వారికి కేబినెట్‌లో తప్పకుండా అవకాశం కల్పిస్తాం.
- యడియూరప్ప, కర్ణాటక ముఖ్యమంత్రి.
ప్రత్యర్థుల కంచుకోటలోనూ...
ఈ ఉపఎన్నికల్లో భాజపా సరికొత్త చరిత్ర లిఖించింది. ఇప్పటి వరకు ఎన్నడూ గెలవని మాండ్య జిల్లా కేఆర్ పేట నియోజకవర్గంలో జయకేతనం ఎగరవేసింది. ఒక్కలిగ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉండే మాండ్య జిల్లా.. కాంగ్రెస్, జేడీఎస్‌కు కంచుకోట. అక్కడ గెలవాలన్నది యడియూరప్ప చిరకాల స్వప్నం.
చిక్కబల్లాపుర, గోకక్ అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ విజయం సాధించింది భాజపా.
కాంగ్రెస్-2.. జేడీఎస్-0
ఉపఎన్నికల్లో కాంగ్రెస్ రెండు చోట్ల విజయం సాధించగా.. మరో చోట భాజపా రెబల్ ఎమ్మెల్యే విజయఢంకా మోగించారు. ఈ ఉప ఎన్నికల్లో జేడీఎస్‌కు ఒక్క సీటైనా దక్కలేదు.
సుస్థిరానికి 'ఆరు'..
కర్ణాటక శాసనసభ ప్రస్తుత సభ్యుల సంఖ్య 222 కాగా.. మేజిక్ ఫిగర్ 112. ఇప్పటివరకు యడియూరప్ప సర్కార్‌కు స్వతంత్ర ఎమ్మెల్యే సహా 106 మంది సభ్యుల బలం ఉంది. కాంగ్రెస్‌కు 66 మంది, జేడీఎస్‌కు 34 మంది ఎమ్మెల్యేలున్నారు.
మేజిక్ ఫిగర్ చేరుకోవటానికి భాజపాకు మరో ఆరుగురు సభ్యులు అవసరం పడగా.. 12 స్థానాల్లో గెలుపొందింది. శాసనసభలో సంఖ్యాబలాన్ని 118కి పెంచుకుంది.
అనర్హతతో ఎన్నికలు...
కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి చెందిన 17 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటుతో అప్పటి కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయింది. తిరుగుబాటు చేసిన 17మందిపై అనర్హత వేటు పడినందున 15 స్థానాలకు ఈనెల 5న ఉప ఎన్నికలు జరిగాయి. మిగతా 2 స్థానాలకు సంబంధించి కోర్టు కేసులు ఉన్నందున ఉప ఎన్నికలు నిర్వహించలేదు.
ఇదీ చూడండి:- 'పౌరసత్వ బిల్లు'పై ఈశాన్య భారతాన ఆగ్రహజ్వాల