వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా సాధన కోసం బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్సీపీతో ప్రాంతీయ పార్టీల కూటమిని ఏర్పాటు చేయాలని భావిస్తోంది ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బిజు జనతాదళ్.
ఒడిశా, బిహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ప్రకటించాలని కేంద్రంపై ఎప్పటి నుంచో డిమాండ్లు ఉన్నాయి.
పార్లమెంటులో బలం...
బీజేడీ, జేడీయూ, వైఎస్ఆర్సీపీలకు పార్లమెంటులో వరుసగా 12,16,22 మంది చొప్పున బలం ఉంది. మూడు పార్టీలు కలిస్తే సంఖ్య 50కి చేరుతుంది. ప్రస్తుతం ఈ మూడు పార్టీల కూటమి విషయం ఆలోచన దశలోనే ఉందని త్వరలో ప్రయత్నాలు మొదలుపెడతామని బీజేడీ పార్లమెంటరీ పార్టీ నేత, పూరీ ఎంపీ పినాకి మిశ్రా తెలిపారు.
మూడు పార్టీలు కలిస్తే పార్లమెంటులో ప్రత్యేక హోదా ఆకాంక్షను బలంగా వినిపించవచ్చని అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు ఈ విషయంపై ఎవరితోనూ సంప్రదింపులు జరపలేదని, పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాక ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెడతామని చెప్పారు మిశ్రా.
ఈ వారమే ప్రధాని మోదీతో సమావేశమయ్యారు నవీన్ పట్నాయక్. ఒడిశాకు ప్రత్యేక హోదా ప్రకటించాలని అభ్యర్థించారు. బిహార్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేక హోదా కోసం ఉద్యమించారు.
ఇదీ చూడండి: చర్చలకు మమత ఆహ్వానం.. జూడాల తిరస్కరణ