వాస్తవాధీన రేఖ వెంబడి చైనాతో ఉద్రిక్తతల మధ్య పార్లమెంటరీ ప్యానెల్ ముందు త్రిదళాధిపతి(చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) జనరల్ బిపిన్ రావత్ హాజరయ్యారు. ఎల్ఏసీ వద్ద ప్రస్తుత పరిస్థితి గురించి పార్లమెంట్ రక్షణ స్థాయీ సంఘంలోని విపక్ష సభ్యులు జనరల్ రావత్‌ను ప్రశ్నించారు. ఈ సమస్యపై ప్రభుత్వం పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
సైనికులకు అందిస్తున్న ఆహారంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు పలువురు సభ్యులు ప్రశ్నలు అడిగినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అధికారులకు, జవానులకు అందించే ఆహారంలో వ్యత్యాసాల గురించి రాహుల్ ఆరా తీసినట్లు వెల్లడించాయి. సరిహద్దులో ప్రస్తుత పరిణామాలపై ఎన్సీపీ నేత శరద్ పవార్ సమావేశంలో ప్రశ్నించినట్లు పేర్కొన్నాయి.
బదులు
సభ్యుల ప్రశ్నలకు స్పందించిన ఆర్మీ ప్రతినిధులు.. సైన్యంలో అందించే ఆహారంలో ఎలాంటి వ్యత్యాసం లేదని స్పష్టం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అధికారులకు, సైనికులకు అందించే ఆహార నాణ్యత, పరిణామాలలో తేడా లేదని.. వారి అభిరుచులు, ఆహారపు అలవాట్ల ప్రకారమే భోజనం అందిస్తున్నట్లు పేర్కొన్నట్లు వెల్లడించాయి.
రాహుల్ తొలిసారి
'సరిహద్దులోని భద్రతా దళాలకు అందిస్తున్న ఆహార నాణ్యతపై పర్యవేక్షణ' అనే అంశాన్ని అధికారిక అజెండాగా నిర్ణయించి సమావేశాన్ని నిర్వహించారు. ఈ స్టాండింగ్ కమిటీకి భాజపా నేత జువాల్ ఓరమ్ నేతృత్వం వహిస్తున్నారు. గతేడాది కమిటీలోకి ఎంపికైన తర్వాత ఈ సమావేశాలకు రాహుల్ గాంధీ హాజరు కావడం ఇదే తొలిసారి.