లాక్డౌన్ కాలంలో ఇంట్లోనే ఉంటన్న భార్యభర్తలకు కలహాలు ఎక్కువైపోయి.. విడిపోతున్నట్లు ఈ మధ్యకాలంలో వింటున్నాం. అయితే భర్తతో గొడవ పడి దూరంగా వెళ్లాలనుకున్న ఓ మహిళను.. తిరిగి కలిపేందుకు ఇదే లాక్డౌన్ సాయపడింది. బిహార్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
జరిగిందేమిటంటే!
బిహార్‌లోని భగల్పుర్కు చెందిన సాబో(పేరు మార్చాం) అనే మహిళకు తన భర్తతో మార్చి 22న చిన్న గొడవ జరిగింది. వెంటనే కోపంతో ఇంటినుంచి బయటికొచ్చి బంకా జిల్లాలో నివాసముంటున్న తన బంధువుల దగ్గరికి వెళ్లేందుకు రైల్వేస్టేషన్ చేరింది. అయితే పొరపాటున ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌కు ప్రయాణించే రైలు ఎక్కేసింది.
తిరుగు ముఖం...
రైలు దిగిన తర్వాత తాను కాన్పుర్‌లో ఉన్నట్లు స్థానికుల ద్వారా తెలుసుకుంది. అప్పటికే ఆమె దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. మరోవైపు, లాక్డౌన్ వల్ల ఎలాంటి రవాణా సదుపాయం లేనుందున కాలినడక వెళ్లమని మహిళకు స్థానికులు సలహా ఇచ్చారు. అంతే, సాబో తిరిగి తన ఇంటికి ప్రయాణం మొదలు పెట్టింది. అలా నడుస్తూ మే 4వ తేదీ ఝార్ఖండ్- బిహార్ అంతర్ రాష్ట్ర చెక్‌పోస్ట్ సమీపంలో సొమ్మసిల్లి పడిపోయింది. వెంటనే స్థానిక పోలీసు అధికారి శివం గుప్తా ఆమెను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు.
కథ సుఖాంతం..
సాబోకు కరోనా నిర్ధరణ కోసం పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ తేలింది. అనంతరం భగల్పుర్ అధికారులు ఆమెను కారులో తీసుకెళ్లి ఇంటిదగ్గర దింపారు. అలా ఆమె ఎన్నో కష్టాల అనంతరం 40 రోజుల తర్వాత మే 14న తిరిగి భర్తను కలుసుకుంది. ప్రస్తుతం ఇద్దరు ఎంతో సంతోషంగా ఉన్నారు. తనకు సాయమందించిన అధికారులకు మహిళ కృతజ్ఞతలు తెలిపింది.