పరీక్షా కేంద్రానికి 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చాడన్న కారణంతో బిహార్‌కు చెందిన ఓ విద్యార్థిని 'నీట్'కు హాజరయ్యేందుకు అధికారులు అనుమతించలేదు. కోల్‌కతాలో జరిగిన ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
బిహార్ దర్భంగకు చెందిన సంతోష్ కుమార్ యాదవ్ అనే విద్యార్థి నీట్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. పరీక్షా కేంద్రం కోల్‌కతాలో ఉంది. తన నివాసం నుంచి అక్కడకు 700 కిలోమీటర్ల దూరం. 24 గంటలు ప్రయాణించి కోల్‌కతా చేరుకున్నాడు.
"దర్భంగలో శనివారం ఉదయం 8 గంటలకు బస్ ఎక్కాను. ముజఫర్‌పుర్, పట్నా మధ్య ట్రాఫిక్ జాం కావడం వల్ల 6 గంటలు వృథా అయింది. పట్నా నుంచి రాత్రి 9 గంటలకు బయల్దేరి ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు కోల్‌కతాకు చేరుకున్నా. ట్యాక్సీలో పరీక్షా కేంద్రానికి వెళ్లేసరికి 1.40 గంటలు అయింది. పరీక్షా కేంద్రంలోకి వెళ్లేందుకు 1.30 గంటల వరకే గడువు ఉందని నన్ను అనుమతించలేదు."
-సంతోష్ కుమార్ యాదవ్, విద్యార్థి
పరీక్షా కేంద్రానికి వెళ్లేందుకు రెండు రోజుల ముందు నుంచే బస్ టికెట్ బుక్ చేసుకునేందుకు ప్రయత్నించినట్లు చెప్పాడు సంతోష్. తనకెంతో కీలకమైన విద్యాసంవత్సరాన్ని కోల్పోయానని బాధ పడుతున్నాడు. వచ్చే ఏడాది కోసం మళ్లీ సన్నద్ధమవుతానని చెబుతున్నాడు.
దీనిపై దృష్టిసారించండి
ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థుల కోసం మార్గదర్శకాలు రూపొందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని శశ్వాంత్ ఆనంద్ అనే న్యాయవాది వ్యాజ్యం దాఖలు చేశారు. ఇలాంటి విద్యార్థుల కోసం మరోసారి పరీక్షను నిర్వహించాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు.