కరోనా జాగ్రత్తల మధ్య బిహార్ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఓటర్లు. ఉదయం తొమ్మిది గంటల వరకు 5.32 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
మొత్తం 71 నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయగా.. ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేస్తున్నారు. దివ్యాంగులు ఓటింగ్లో పాల్గొనేందుకు సాయం చేస్తున్నారు సీఆర్పీఎఫ్ జవాన్లు.
'తొలుత ఓటు హక్కు.. ఆ తర్వాతే అల్పాహారం'
కొవిడ్-19 జాగ్రత్తలు పాటిస్తూ ప్రజాస్వామ్య పండుగలో పాల్గొనాలని కోరారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవాలని, తప్పనిసరిగా 2 గజాల దూరం పాటిస్తూ.. మాస్క్ ధరించాలని సూచించారు. "తొలుత ఓటు హక్కు.. ఆ తర్వాతే అల్పాహారం" అని ట్వీట్ చేశారు.
ఓటింగ్లో పాల్గొనాలని ప్రజలను కోరారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్. కరోనా నిబంధనలు పాటిస్తూ.. అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగలో ఓటర్లు భాగస్వాములు కావాలని కోరారు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఓటు వేసే హక్కు ప్రజాస్వామ్యానికి అతిపెద్ద బలమని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: బిహార్ బరి: నితీశ్ పీఠం నిలిచేనా- ఓటరు ఎవరివైపు?