బిహార్‌లో నితీశ్ కుమార్ సర్కారు చేపట్టిన పర్యావరణ పరిరక్షణ, సామాజిక సంస్కరణలకు ఆ రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలికారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పిలుపు మేరకు రాష్ట్రంలో 18 వేల కిలోమీటర్ల భారీ మానవహారం ఏర్పాటు చేశారు.
ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీతోపాటు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పట్నాలోని గాంధీ మైదానంలో నిర్వహించిన మానవహారంలో పాల్గొన్నారు. ఇక్కడ నాయకులు, విద్యార్థులు బిహార్ మ్యాప్ ఆకారంలో నిలబడి ప్రభుత్వానికి మద్దతు తెలిపారు.
జల్-జీవన్-హరియాళి
నీటి సంరక్షణ, మెరుగైన జీవన విధానం, పచ్చదనాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా 'జల్-జీవన్-హరియాళి' పేరిట చేపట్టిన ఈ ఉద్యమంలో బిహార్‌లో అన్నిప్రాంతాల ప్రజలు భాగస్వాములయ్యారు. కొన్నిచోట్ల నదులు, చెరువుల్లో పడవలతోనూ మానవహారాలను ఏర్పాటు చేశారు.
వివిధ ప్రాంతాల్లోని ప్రధాన రహదారుల వెంట 18 వేల కిలోమీటర్ల మేర మానవహారం నిర్వహించి రాష్ట్ర ప్రజలు తమ ప్రత్యేకతను చాటుకున్నారు. సుమారు 5 కోట్ల మంది ప్రజలు ఈ కార్యక్రమంలో భాగమైనట్లు బిహార్ ప్రభుత్వం అంచనా వేసింది. వరకట్నం, బాల్యవివాహాలను వ్యతిరేకించడం, మద్యపాన నిషేధానికి అనుకూలంగా నితీశ్ కుమార్ సర్కార్ ఈ ఉద్యమాన్ని చేపట్టింది. 2017 నుంచి ఏటా ఈ కార్యక్రమాన్ని బిహార్ ప్రభుత్వం నిర్వహిస్తోంది.