ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్ కాల బ్యాలెట్ బరిగా బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు పూర్వరంగం సిద్ధమైపోయింది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గతానికి భిన్నంగా మూడు విడతల్లోనే ఎన్నికలు ముగించనున్న ఈసీ- కాలపట్టిక మేరకు తొలి దశ నోటిఫికేషన్ సైతం వెలువరించింది. పదహారు జిల్లాలకు విస్తరించిన వామపక్ష తీవ్రవాదం దృష్ట్యా బిహార్ ఎన్నికల నిర్వహణ నిర్వాచన్ సదన్‌కు ఎప్పుడూ కత్తిమీద సామే. ఈసారి కసిగా కోరసాచిన కొవిడ్ మహమ్మారి బిహార్లో లక్షా 80వేల కేసులు, దాదాపు తొమ్మిది వందల మరణాలతో భీతిల్లజేస్తున్న వేళ 7.2 కోట్లమంది ఓటర్ల ఆరోగ్య భద్రతకూ పూచీపడి ప్రజాస్వామ్య క్రతువును స్వేచ్ఛగా, సక్రమంగా పూర్తి చెయ్యడం ఈసీ కార్యదక్షతకు పెను పరీక్షే! నామినేషన్లు, ప్రచారం, ఓటింగ్, లెక్కింపు ప్రక్రియలన్నింటా పూర్తిస్థాయి జాగ్రత్తలకు ఈసీ పెద్దపీట వేసింది. కొవిడ్ నియంత్రణను లక్షించిన అదుపు ఆజ్ఞల్లో పార్టీలన్నీ ఒద్దికగా నడుచుకొనేలా చూడటం నుంచి పోలింగ్ శాతం పడిపోకుండా జనంలో విశ్వాసం పాదుకొనేలా జాగ్రత్తపడటం దాకా- ఈసీ అక్షరాలా మండల దీక్ష వహించాలి.
ఎన్‌డీఏ కూటమికి పెద్ద దిక్కుగా..
క్రితం ఎన్నికలతో పోలిస్తే బిహార్ రాజకీయాల రూపురేఖా విలాసాలు గణనీయంగా మారిపోయాయి. లోగడ నితీశ్‌కుమార్ జేడీ (యూ), లాలూ యాదవ్ ఆర్‌జేడీ చెరో నూటొక్క స్థానాల్లోనూ, కాంగ్రెస్ తక్కిన చోట్లా ‘మహా ఘట్ బంధన్’గా పోటీపడి 41.9శాతం ఓట్లు, 178 సీట్లతో విజయ ఢంకా మోగించాయి. పాసవాన్ ఎల్‌జేపీ, కుశ్వహా ఆర్‌ఎల్‌ఎస్‌పీ, జతిన్ రామ్ హెచ్‌ఏఎమ్ పార్టీల భాగస్వామ్యంతో గిరిగీసి నిలిచిన భాజపా- ఉమ్మడిగా 34శాతం ఓట్లు, 58 సీట్లకే పరిమితమైంది. మూడేళ్ల క్రితం ప్లేటు ఫిరాయించిన ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎన్‌డీఏ కూటమికి నేడు పెద్ద దిక్కుగా మారిన ‘రాజకీయ చిత్రం’ - సీట్ల పంపకాల సిగపట్లను ఉద్ధృతం చేసింది!
ఊసరవెల్లి రాజకీయాల ఉరవడి..
ఏ ఒక్క కులమో పార్టీల జాతకాల్ని తిరగరాసే అవకాశం లేని సామాజిక కూర్పు బిహార్ సొంతం. అగ్రవర్ణాలు 17.1శాతంగా ఉన్న రాష్ట్రంలో యాదవులు, ముస్లిములు, దళితులు తలా 14శాతానికి పైగా జనసంఖ్యతో రాజకీయాల్ని అనుశాసిస్తుంటాయన్నది వాస్తవం. కుర్మి కొయిరి ఆదివాసులతోపాటు ఇతర కులాలు జనాభాలో 32.5శాతంగా ఉండబట్టే- బిహార్ ఎన్నికల బరిలో దాదాపు 150 దాకా భిన్న పక్షాలు అస్తిత్వ పోరాటం చేస్తుంటాయి. గాలివాలుకు తెరచాపలెత్తడంలో రాటుతేలిపోయిన ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ 15ఏళ్ల అవిచ్ఛిన్న పాలనపై బిహారీలు తీర్పు చెప్పే ఎన్నికలివి. 'జబ్ తక్ రహేగా సమోసా మే ఆలూ, తబ్‌తక్ రహేగా బిహార్ మే లాలూ' అంటూ నితీశ్ రాకముందు రాష్ట్రంపై గుత్తపెత్తనం చలాయించిన లాలూ ప్రసాద్ బొమ్మ లేకుండా వెలుస్తున్న ఆర్‌జేడీ పోస్టర్లు- కొత్త తరం రాజకీయాల్ని కళ్లకు కడుతున్నాయి. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో లాలూ బొమ్మతో ప్రచారం చేసిన లాంతరు పార్టీ- 40 సీట్లకుగాను ఏ ఒక్కటీ గెలుచుకోలేక మసిబారిపోయింది. అవినీతి మకిలంటిన తండ్రి లాలూ ముద్రల్ని చెరిపేసి ఆర్‌జేడీ సారథ్యం చేపట్టిన తేజస్వీ యాదవ్- సీట్లలో గౌరవప్రద వాటా నిరాకరిస్తున్నారంటూ కాంగ్రెస్ కస్సుబుస్సులాడుతోంది. మరోవంక ఎన్‌డీఏలో జేడీ(యూ), భాజపాల మధ్య ప్రధాన వాటాలకోసం కోలాటం సాగుతుంటే- రామ్‌విలాస్ పాసవాన్ తనయుడిగా ఎల్‌జేపీ బాధ్యతలు చేపట్టిన చిరాగ్ ఎకాయెకి 143 సీట్లలో పోటీకి సిద్ధమంటూ చేస్తున్న హడావుడి రాజకీయ డ్రామాను రక్తి కట్టిస్తోంది. భీకర వరదల తాకిడికి 80 లక్షల మంది బాధితులై పోగా, కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి తిరిగి వచ్చిన 16 లక్షల మంది వలస శ్రామికుల సమస్యా రేపటి ఎన్నికల్లో విపక్షానికి ప్రధాన అస్త్రం కానుంది. పాత కూటములు కూలి కొత్తవి పురుడు పోసుకొంటున్న బిహార్‌లో- ఊసరవెల్లి రాజకీయాల ఉరవడే దిగ్భ్రాంతపరుస్తోంది!
ఇదీ చూడండి: బిహార్ బరి: నేరచరితుల భార్యలదే హవా!