భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అభివృద్ధి చేసిన కొవిడ్-19 టీకా, 'కొవాగ్జిన్'పై మూడో దశ క్లినికల్ పరీక్షలు మొదలుకానున్నాయి. నవంబరులో దేశవ్యాప్తంగా 25 కేంద్రాల్లో 26,000 మంది వలంటీర్లపై ఈ టీకాను పరీక్షిస్తారు. మొదటి దశ, రెండో దశ క్లినికల్ పరీక్షలను విశ్లేషించిన మీదట కొవాగ్జిన్‌పై 3వ దశ పరీక్షల నిర్వహణకు డీసీజీఐ (డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) అనుమతి ఇచ్చినట్లు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ శుక్రవారం వెల్లడించింది.
కొవాగ్జిన్‌పై ఇప్పటివరకూ నిర్వహించిన పరీక్షల సమాచారాన్ని డీసీజీఐ సారథ్యంలోని సబ్జెక్టు నిపుణుల కమిటీ వారం క్రితం పరిశీలించి, 3వ దశ పరీక్షల నిర్వహణకు సిఫారసు చేసింది. దీనికి అనుగుణంగా డీసీజీఐ అనుమతి ఇచ్చింది. ఈ పరీక్షలు ఈ నవంబరులో మొదలై, వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తవుతాయి. దేశంలో ఇంత భారీస్థాయిలో 3వ దశ పరీక్షలు నిర్వహిస్తున్న టీకా ఇదే కావడం ప్రత్యేకత. ఇందుకు భారత్ బయోటెక్ దాదాపు రూ.150 కోట్ల వరకు వెచ్చిస్తుంది.
త్వరలో అందుబాటులోకి..
'కొవాగ్జిన్'పై మూడోదశ పరీక్షలు మొదలవుతున్న నేపథ్యంలో, ఈ టీకా త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది ఏప్రిల్- మే నాటికి టీకా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ 'అత్యవసర వినియోగ అనుమతి' ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయిస్తే, అంతకంటే ముందే అందుబాటులోకి రావచ్చు. చైనా, రష్యా దేశాల్లో ప్రభుత్వం చొరవ తీసుకొని కొవిడ్-19 టీకాలకు అత్యవసర అనుమతి ఇచ్చిన విషయం ఈ సందర్భంగా గమనార్హం. ఇప్పటివరకూ నిర్వహించిన పరీక్షల సమాచారం ఆధారంగా ‘కొవాగ్జిన్’కు అత్యవసర అనుమతి ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించవచ్చు.
కొవాగ్జిన్‌కు అత్యవసర అనుమతి లభిస్తే
తొలిదశలో టీకాను ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా ఉన్న వైద్యులు, నర్సులు, అత్యసవర సేవల్లో నిమగ్నమైన వారు, ఆయిల్ అండ్ గ్యాస్ రంగానికి చెందిన సిబ్బంది, టీచర్లు.. తదితరులకు ఇచ్చే వీలుంటుంది.
రూ.150 కోట్లతో రెండో యూనిట్
కొవాగ్జిన్‌పై పరీక్షలు చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో భారత్ బయోటెక్ తన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవటంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఉన్న మొదటి యూనిట్‌కు తోడు, రూ.150 కోట్లతో రెండో యూనిట్ ఏర్పాటు చేస్తోంది. ఈ యూనిట్ నిర్మాణం మరో రెండు నెలల్లో పూర్తవుతుందని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయిప్రసాద్ తెలిపారు. దీంతో కంపెనీకి ఏటా 15 కోట్ల డోసుల ‘కొవాగ్జిన్’ టీకా తయారుచేసే సామర్థ్యం సమకూరుతుందని ఆయన పేర్కొన్నారు. ఇదేగాక ‘కొవాగ్జిన్’కు లభించే డిమాండ్‌కు అనుగుణంగా మన దేశంలో లేదా విదేశాల్లో మరొక యూనిట్ నెలకొల్పే అవకాశం ఉన్నట్లు వివరించారు. టీకా ధర ఎంత ఉంటుందనే ప్రశ్నకు.. ఇప్పుడే చెప్పలేమని ఆయన బదులిచ్చారు. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా టీకా ధర ఉంటుందన్నారు.
తొలి దేశీయ టీకా
‘కొవాగ్జిన్’ మనదేశంలో స్వతంత్రంగా తయారైన తొలి కొవిడ్-19 టీకా. దీన్ని ఐసీఎంఆర్- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అందించిన సార్స్-కోవ్-2 స్ట్రెయిన్‌తో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసింది. ఇప్పటివరకూ నిర్వహించిన పరీక్షల్లో ఈ టీకా సమర్థత రుజువైనట్లు, ఇంతకుముందే భారత్ బయోటెక్ వెల్లడించింది.
ఇదీ చదవండి:'భాజపా ఉచిత టీకా వాగ్దానం చట్టబద్ధమే'