కేంద్రం అనుసరిస్తోన్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక సంఘాలు చేపట్టిన 24 నాలుగు గంటల సమ్మె ప్రభావం దేశంలోని చాలా ప్రాంతాల్లో పాక్షికంగా కనిపించింది. బంద్‌కు పిలుపునిచ్చిన సీపీఐ, సీఐటీయూ, డీవైఎఫ్ఐ పలు ప్రాంతాల్లో ర్యాలీలు చేపట్టాయి. ఫలితంగా కొన్ని చోట్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
బంగాల్లో ఇలా...
హావ్‌డా రైల్వే స్టేషన్లో నిరసన దీక్షకు యత్నించిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. కూచ్‌బెహార్, జార్గ్రామ్ జిల్లాల్లో కార్మిక సంఘాల నేతలు రోడ్డుపై బైఠాయించారు. కొన్ని చోట్ల టైర్లు తగలబెట్టారు. మరికొంత మంది బస్సు అద్దాలు పగలగొట్టారు. కార్మికులు రైల్వే ట్రాక్‌లపై ఆందోళనలు చేపట్టడం వల్ల పలు రైలు సర్వీసులు నిలిచిపోయాయి.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ సమ్మెలో పాల్గొనకపోయినా... నైతికంగా మద్దతు తెలిపింది.
ఒడిశాలో ఇలా...
ఉదయం ఆరు గంటలకే నిరసనకారులు రోడ్లపైకి చేరుకున్నారు. బ్యానర్లు, పోస్టర్లు పట్టుకుని ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో జాతీయరహదారిపై వాహనాలు రాకపోకలకు కొంతమేర అంతరాయం ఏర్పడింది. భువనేశ్వర్‌లోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ కార్యాలయం ముందు ఆందోళనకారులు ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఎక్కువే...
కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో బంద్ ప్రభావం ఎక్కువగా కనిపింది. పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు రోడ్లమీదకు వచ్చారు. బస్సులు అన్నీ డిపోలకు పరిమితం అయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, ఇతర సంస్థలు అన్నీ స్వచ్ఛందంగా మూసివేశారు.
అయితే కేరళలో శబరిమల ఆలయానికి వచ్చే భక్తులకు సమ్మె నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇందుకుగానూ ప్రభుత్వం కేఎస్ఆర్టీసీ బస్సులను కొండపైకి తిప్పింది.
పంజాబ్, హరియాణా, తెలంగాణ, గోవా రాష్ట్రాల్లో కేరళ, తమిళనాడు లాంటి పరిస్థితులే కనిపించాయని ఏఐసీటీయూ జనరల్ సెక్రెటరీ అమర్జీత్ కౌర్ తెలిపారు.
బ్యాంకు సేవలపై ప్రభావం..
దేశవ్యాప్త సమ్మె కారణంగా బ్యాంకు కార్యకలపాలకు కొంతమేర అంతరాయం ఏర్పడింది. కొన్ని బ్యాంకుల ఉద్యోగులు బంద్‌లో పాల్గొన్నారు. బ్యాంక్‌ల ప్రైవేటీకరణ, ఉద్యోగాల్లో ఔట్సోర్సింగ్ విధానానికి వ్యతిరేకంగా ఏఐబీఈఏ, ఏఐబీఓఏ, బీఈఎఫ్ఐ సంఘాలు నిరసనలు చేపట్టాయి.