గుజరాత్... భారతీయ జనతా పార్టీ కంచుకోట. వ్యాపారుల గడ్డమీద భాజపా నమ్మకం పాటీదార్లు. అయితే గత విధానసభ ఎన్నికల ముందు ఈ పరిస్థితి మారిపోయింది. రిజర్వేషన్లు కోరుతూ... హార్దిక్ పటేల్ నాయకత్వంలోని పాటీదార్ అనామత్ ఆందోళన్ సమితి(పీఏఏఎస్) ఉద్యమ బాట పట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో దీని ప్రభావం తీవ్రంగా పడింది. అయితే చివరకు భాజపానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది.
రాహుల్ గాంధీ సమక్షంలో హార్దిక్ పటేల్ ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీనితో పటేల్ కోటా ఉద్యమంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఉద్యమం కొనసాగించాలా? లేదా? అన్నదానిపై పీఏఏఎస్ నేతల మధ్య భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి.
10 శాతం కోటా లభించిన దృష్ట్యా రిజర్వేషన్ సమస్య ముగిసిందని... రైతులు, యువతకు ఉద్యోగం లాంటి సమస్యలపై పోరాటం చేస్తామని హార్దిక్ పటేల్, ఆయన మద్దతుదార్లు తెలిపారు. అయితే పాటీదార్ అనామత్ ఆందోళన్ సమితి మాత్రం రిజర్వేషన్ల ఉద్యమం కొనసాగిస్తామని చెబుతోంది. దీనికి ఇప్పటికీ హార్ధిక్ పటేలే అధ్యక్షుడిగా ఉన్నారు.
ఉద్యమం అయిపోయింది: హార్దిక్ మద్దతుదార్లు
హార్దిక్ పటేల్ మొదటి సారిగా 2015లో ఉద్యమంతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఉద్యమం ప్రారంభించినప్పుడు వెనుకబడిన తరగతుల కింద కోటా కోరినా... తరవాత మాత్రం ఆర్థికంగా వెనుకబడిన తరగతి కింద రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశామని హార్దిక్ గుర్తుచేశారు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు హార్దిక్.
"ప్రస్తుతం 10 శాతం అగ్రవర్ణ కోటాను సరిగ్గా అమలు చేసే విధంగా చూడటమే నా బాధ్యత. కోటా పేరుతో రాజకీయాలు చేయను. ఎందుకంటే ఇప్పటికే రిజర్వేషన్లు ఇచ్చినా రాజకీయం కోసమే డిమాండ్ చేస్తున్నారనే అపవాదు మూటగట్టుకోలేను." -హార్దిక్ పటేల్
పాటీదార్ ఆందోళన్ సమితి కోర్ కమిటీలోని మరో నేత గీతా పటేల్... 2015 ఉద్యమం సందర్భంగా పలువురు నాయకులపై పెట్టిన వివిధ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
ఇంకా అయిపోలేదు : పాటీదార్లు
"ఓబీసీ ప్రకారమే రిజర్వేషన్లు కల్పించాలన్నదని మా డిమాండ్. కాబట్టి పోరాటం ఇంకా ముగియలేదు. గతంలో గుజరాత్ ప్రభుత్వం కల్పించిన ఈబీసీ కోటా రిజర్వేషన్లను హైకోర్టు కొట్టేసింది. ఇప్పుడు కేంద్రం కల్పించిన కోటాను కూడా కోర్టులు నిలిపేస్తే ఎలా?"
-దిలీప్ సబ్వా, పాటీదార్ ఆందోళన్ ఇన్చార్జి
ఈబీసీ కోటాపై అసంతృప్తి వ్యక్తం చేశారు సబ్వా.
"ఎన్నికల్లో పోటీ చేయటానికి ఉద్యమాన్ని ఎవరైనా పక్కన బెడితే అది వారి ఇష్టం. సమస్యను రాజకీయ కోణంలో చూసే వారితో మాకు సంబంధం లేదు."
-దిలీప్ సబ్వా, పాటీదార్ ఆందోళన్ ఇన్చార్జి
ఓబీసీ రిజర్వేషన్ ఇచ్చేంతవరకు ఉద్యమాన్ని ఆపేది లేదు. హార్దిక్ వెంట వెళ్లేవారు కాంగ్రెస్‌లో చేరొచ్చు. ప్రస్తుతం జైల్లో ఉన్న పాటీదార్ ఆందోళన్ సమితి కన్వీనర్ అల్పేష్ కత్రియా ఉద్యమానికి నాయకత్వం వహిస్తారు." -పాటీదార్ సమితి నేత దినేష్ బంబానియా