దేశంలో వేల సంఖ్యలో ఆలయాలు ఉన్నాయి. ఒక్కో గుడిలో ఒక్కో రీతిలో పూజలు ఉంటాయి. అదే క్రమంలో బెంగళూరులోని బసవన్నగుడిలో కడలెకై పరిశే (శెనక్కాయల అభిషేక ఉత్సవం) నిర్వహిస్తారు. కార్తీక మాసం చివరి సోమవారం మొదలుకొని మూడు రోజుల పాటు వేడుకలు జరుగుతాయి. సోమవారం ప్రారంభమైన ఈ ఉత్సవం నేడు ముగియనుంది.
ఈ ఉత్సవాల కోసం సమీప ప్రాంతాల నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆలయం ప్రాంగణంలో సుమారు 10 వేల శెనక్కాయల స్టాళ్లు ఏర్పాటు చేశారు. శెనక్కాయల అభిషేకం ఆచారం 1537లో బెంగళూరు పట్టణ నిర్మాణం జరిగినప్పటి నుంచి వస్తున్నట్లు విశ్వాసం.
బసవన్నగుడితో పాటు నగరంలో వెంకతల, మల్లేశ్వరం ఆలయాల్లో ఇలాంటి ఉత్సవాలే జరుగుతాయి. బసవన్నగుడిలో చిక్కా, పరిశే అనే రెండు ఉత్సవాలు నిర్వహిస్తారు. చిక్కా అనేది అభిషేకానికి వారం రోజుల ముందు నిర్వహించే చిన్న ఉత్సవం. అనంతరం దొడ్డ (పెద్ద) అభిషేకం కార్తీక సోమవారం జరుగుతుంది. దీనిని నగర వ్యవస్థాపకుడు నాదప్రభు హిరియా కెంపెగౌడ ప్రారంభించినట్లు చెబుతారు.
అభిషేకం చేసే శెనక్కాయలను బసవన్న ఆరగిస్తాడని ఇక్కడి భక్తులు చెబుతారు. మూడు రోజులతో పాటు మరునాడు అక్కడ ఖాళీ తొక్కలు దర్శనమిస్తాయని, బసవన్న తనివితీరా వాటిని ఆరగిస్తున్నాడని భక్తుల విశ్వాసం.
ఆచారం ఎలా వచ్చింది?..
నగరంలోని దొడ్డ బసవన్న (పెద్ద ఎద్దు), దొడ్డ గణేశ ఆలయాల పరసరాల్లోని శెనక్కాయల రైతులను దొంగలు ఇబ్బందులకు గురిచేసేవారు. వారి పంటను దోచుకెళ్లేవారు. ఆ సమయంలో రైతులను, పంటలను రక్షించేందుకు మహా శివుడు బసవన్నను పంపాడని విశ్వాసం. అయితే.. దొంగలను పట్టుకునేందుకు గ్రామస్థులంతా బృందంగా ఏర్పడి పంటలకు కాపలా కాయటం ప్రారంభించారు. అక్కడికి వచ్చిన ఆ ఎద్దును గ్రామస్థులే చంపేశారు. దాంతో శెనక్కాయల పంటకు నందీశ్వరుడు శాపం పెట్టినట్లు చెబుతారు. ఆ సమయంలో బసవన్న శిలగా మారిందని.. దానిని కెంపెగౌడ ఆలయంలో ప్రతిష్టించారని అంటారు. అయినప్పటికీ.. శెనక్కాయల పంట పండకపోవటం వల్ల నందీశ్వరుడికీ శెనక్కాయలతో అభిషేకం చేయటం ప్రారంభించినట్లు భక్తులు చెబుతున్నారు. ఆ తర్వాతే పంట దిగుబడి రావటం మొదలైందని.. బసవన్న విగ్రహమూ పెరుగుతూ వస్తోందన్నది స్థానికుల మాట.
ఇదీ చూడండి: వ్రతం చెడ్డా దక్కని ఫలం..!