"లోక్‌సభ సీట్లలో 41శాతం మహిళలకే!"... బంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి ప్రకటన ఇది. మహిళలకు పెద్దపీట వేస్తున్నారంటూ... ఈ వార్త దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 'మమత భేష్' అంటూ ప్రశంసలకు ఆస్కారమిచ్చింది.
బంగాల్లోని 42 లోక్‌సభ సీట్లలో 17 స్థానాలు మహిళలకు ఇస్తున్నామన్న మాటతో పాటు మరో ప్రకటన చేశారు మమత. 10మంది సిట్టింగ్ ఎంపీలకు టికెట్ నిరాకరించారు. 18మంది కొత్తవారిని పోటీకి దింపారు. ప్రజావ్యతిరేకత, స్థానిక సమీకరణాలే ఇందుకు కారణమన్నది మమత వాదన. సాధ్యమైనన్ని స్థానాల్లో విజయమే లక్ష్యంగా ఆమె చేసిన ఈ మార్పులు... టీఎంసీకి చిక్కులు తెచ్చిపెట్టాయి. టికెట్ రాని నేతలు... వలసబాట పడుతున్నారు. కాషాయ కండువా కప్పుకుంటున్నారు.
ఒక్కరితో మొదలు...
బంగాల్లో ఎలాగైనా పాగా వేయాలన్నది భాజపా లక్ష్యం. అందుకోసం ఎప్పటినుంచో విశ్వప్రయత్నాలు చేస్తోంది. పార్టీ బలోపేతానికి అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటోంది. కూచ్‌బెహార్, బాసిర్షాట్, ఝార్గ్రామ్, మెదీనీపూర్, బోల్పూర్, బిష్ణుపూర్, కృష్ణనగర్ లోక్‌సభ నియోజకవర్గాల్లో టీఎంసీ నేతల మధ్య వర్గపోరును సానుకూలాంశంగా మార్చుకుంది భాజపా. ఆ స్థానాల్లో పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషిచేసింది. భాజపా బలపడడాన్ని గుర్తించి... మమత అప్రమత్తమయ్యారు. ప్రజావ్యతిరేకత ఎక్కువగా ఉన్నచోట్ల సిట్టింగ్‌లను పక్కనబెట్టారు. ఇదే ఇప్పుడు ఇబ్బందులకు కారణమైంది.
టీఎంసీలో అసమ్మతి జ్వాల రేగింది. అసంతృప్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వారిని భాజపావైపు నడిపించడంలో ముకుల్ రాయ్‌ది కీలక పాత్ర. తృణమూల్ కాంగ్రెస్‌లో ఒకప్పుడు మమత తర్వాత స్థానం ఆయనదే. 2017 నవంబర్‌లో భాజపాలో చేరారు. ఇప్పుడు... టీఎంసీ అసమ్మతులు భాజపాలోకి వచ్చేందుకు వారధిగా మారారు.
టికెట్ ఇవ్వకపోతే అంతేగా...!
టీఎంసీ సిట్టింగ్‌లను తప్పించడమే కాక... ఎప్పటినుంచో పార్టీ కోసం పనిచేస్తున్నవారిని పక్కనబెట్టి, కొత్తవారిని పోటీకి నిలపడం మరింత అసమ్మతికి కారణమైంది. కొందరు సినీతారలు, అది కూడా ఎలాంటి రాజకీయ అనుభవంలేని వారికి టికెట్ ఇవ్వడం స్థానిక నేతల్ని ఆగ్రహానికి గురిచేసింది. గత ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన నలుగురు నేతలకు లోక్‌సభ టికెట్లు కేటాయించడం టీఎంసీలో ఎప్పటినుంచో ఉన్నవారికి రుచించలేదు.
బాలూర్ఘాట్ నుంచి అర్పితా ఘోష్‌కు మరోమారు టికెట్ ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు స్థానిక నేతలు.
"ఘోష్ పనితీరు పట్ల బాలూర్ఘాట్ ప్రజలు సంతృప్తిగా లేరని పార్టీకి చెప్పాను. ఈసారి ఆమె గెలుపు ఖాయమని చెప్పలేం. ఆమెకన్నా సమర్థమైన నేతలు ఎందరో ఉన్నారు. వారికి అవకాశం ఇచ్చి ఉంటే తప్పక గెలిచేవారు. అయినా.. ఘోష్ విజయం కోసం కృషిచేస్తాం."
-విప్లవ్ మిత్ర, టీఎంసీ దక్షిణ దినాజ్‌పూర్ జిల్లా అధ్యక్షుడు
కూచ్‌బెహార్‌లో సిట్టింగ్ ఎంపీ పార్థా ప్రతిమ్ రేను తప్పించడంపైనా స్థానిక నేతాగణం గుర్రుగా ఉంది.
"పరేశ్ చంద్ర అధికారికి కూచ్‌బెహార్ టికెట్ ఎందుకు ఇచ్చారు? లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మా జిల్లా నేతల్లో సమర్థులు లేరా? పరేశ్కు టికెట్ ఇవ్వడం పార్టీ శ్రేణులకు చెడు సంకేతం పంపింది"
-కూచ్‌బెహార్ నియోజకవర్గం స్థానిక నేత
మరికొన్ని స్థానాల్లోనూ ఇదే పరిస్థితి. అసంతృప్తుల్లో కొందరు ఇప్పటికే భాజపాలో చేరారు. మరికొందరు త్వరలో అదే బాట పట్టే అవకాశముంది.
"నేను 30ఏళ్లు మమత వద్ద పని చేశాను. జమ్ములో జరిగిన దాడిలో పక్క దేశం ఉగ్రవాదులు 40మంది జవాన్లను పొట్టనపెట్టుకున్నారు. అప్పుడు మమత చేసిన వ్యాఖ్యలు నన్ను బాధించాయి. భారత వాయుసేన దాడుల్లో మృతిచెందిన ఉగ్రవాదుల శవాలెక్కడ అని అడిగారు. నేను ఇలాంటి వ్యక్తి దగ్గర పని చేస్తున్నానా అని బాధపడ్డాను. దేశంపై ప్రేమ లేని నేత... ఓటరుకు మంచి చేయలేరు."
-అర్జున్ సింగ్, భాజపా నేత
"ఇప్పటినుంచి మమత రాజ్యం అంతమైనట్లే. మహాభారతంలోని అర్జునుడు ఇవాళ భాజపాలో ఉన్నారు. ఇప్పటికే టీఎంసీకి చెందిన సౌమిత్రా ఖాన్, అనుపమ్ హజ్రా చేరారు. సీపీఎం, కాంగ్రెస్ నేతలు కూడా భాజపా కండువా కప్పుకున్నారు. ఇది ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ముందుంది."
- ముకుల్ రాయ్, భాజపా నేత
మమత మాత్రం... అసంతృప్తుల వలసల్ని తేలిగ్గా తీసుకున్నట్లు చెప్పారు.
"మా పార్టీ శ్రేణులపై నాకు పూర్తి భరోసా ఉంది. వారు టీఎంసీ విధానాలు, క్రమశిక్షణకు కట్టుబడి ఉంటారు. పోటీ చేయాలన్న కోరిక ఉన్నా అవకాశం దక్కని వారు కొందరు ఉండి ఉంటారు. వారికి ఇతర ఆలోచనలు ఉండి ఉండొచ్చు. వారు వెళ్లిపోవచ్చు."
-మమతా బెనర్జీ, టీఎంసీ అధినేత్రి
2016 శాసనసభ ఎన్నికల్లో విజయం తర్వాత... 17మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు వామపక్ష ఎమ్మెల్యేలు టీఎంసీలో చేరారు. ఇప్పుడు అదే స్థాయిలో తృణమూల్ కాంగ్రెస్ నుంచి వలసలు ఉండడం విశేషం.