సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనల గురించి విదేశీ ప్రముఖులు చేసిన వ్యాఖ్యలపై భారత విదేశీ వ్యవహారాల శాఖ స్పందించింది. ఈ నిరసనలను భారత ప్రజాస్వామ్య విలువలు, రాజకీయ నేపథ్యంలోనే చూడాలని స్పష్టం చేసింది. రైతుల ఆందోళనలపై వ్యాఖ్యలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని సూచించింది.
సామాజిక మాధ్యమాల్లో సంచలనాత్మక హ్యాష్ ట్యాగ్లు, వ్యాఖ్యల్లో కచ్చితత్వం ఉండదని, బాధ్యతారాహిత్యంగా ఉంటాయని విదేశాంగ శాఖ తెలిపింది. ముఖ్యంగా ప్రముఖులకు ఇది ఎక్కువగా వర్తిస్తుందని పేర్కొంది.
పాప్ సింగర్ రిహానా సహా పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ వంటి ప్రముఖులు దిల్లీ సరిహద్దులో రైతుల ఆందోళనలకు మద్దతు ప్రకటిస్తూ ట్వీట్ చేసిన నేపథ్యంలో భారత్ ఈ విధంగా స్పందించింది. తొందరపడి వ్యాఖ్యలు చేసేముందు వాస్తవాలేంటో అర్థం చేసుకోవాలని హితవు పలికింది.