మరాఠ్నగర్లోని కాశీనాథ్ నగర్లో 83 ఏళ్ల సుందర్‌బాయి దగ్డూ నాయక్వాడే వయోభారంతో సోమవారం మృతిచెందింది. వార్త వినగానే వారి బంధువులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. ఏ ఒక్కరినీ నొప్పించని గొప్ప మనస్తత్వం ఆమెది.
'అమ్మ'కు అంతిమ వీడ్కోలు..
కోడళ్లను కుమార్తెల్లా చూసుకునే సుందర్‌బాయి ఇక లేదనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు ఆమె కోడళ్లు. నలుగురు కుమారులు, మనుమళ్లు... ఇలా అందరూ పురుషులే ఆమె అంతిమ యాత్రలో పాల్గొంటున్నారు. కానీ, అమ్మలా ఆదరించిన అత్తకు చివరి సారిగా సేవ చేసుకోవాలనుకున్నారు కోడళ్లు లతా నవనాథ్, ఉషా రాథాకిషన్, మనీషా జలీందర్, మీనా మచ్చీంద్ర .
ఆడవాళ్లు అంతిమ సంస్కారాల్లో పాల్గొనకూడదన్న కట్టుబాట్లను వారు పట్టించుకోలేదు. చుట్టూ జనాల గుసగుసలూ వినిపించుకోలేదు. తిరిగిరాని లోకాలకు వెళ్లిన అత్తమ్మకు ఏం చేయగలమన్నది తప్ప ఇంకేమీ ఆలోచించలేదు. పావు కిలోమీటరు దూరం వరకు భుజాలపై మృతదేహాన్ని మోశారు. ఆపై అంతిమ యాత్రకు ఉద్దేశించిన వాహనంలో ఎక్కించారు.
ఆమె చివరి కోరికనూ గుర్తు పెట్టుకుని మరీ తీర్చారు సుందర్‌బాయి కుటుంబసభ్యులు.
"ఆమె చివరి కోరిక నేత్ర దానం చేయాలన్నదే. అందుకే మేము ఆ కోరిక తీర్చాము. అమ్మ నేత్రాలు దానం చేశాము. 2013లో నాన్న దగ్డూ మరణించినప్పుడూ ఇలాగే నేత్ర దానం చేశాము."
-నవనాథ్ డీ నాయక్వాడే, సుందర్‌బాయి కుమారుడు
ఇదీ చూడండి:లంచం అడిగిన తహసీల్దార్‌కు దున్నపోతు బహుమానం!