ఇంటి నిర్మాణం ఎంతో ఖర్చుతో పాటు సమయంతో కూడుకున్నది. నెలల తరబడి కష్టపడితే కానీ పని పూర్తవదు. ఇటుక, ఇసుక, కంకర, సిమెంటు ఇలా చెప్పుకుంటూ పోతే ఇంటి కోసం ఎన్నో అవసరం. అన్నీ ఉన్నా కొన్ని సందర్భాల్లో అనుకున్న సమయానికి పూర్తి కాదు. ఇలాంటి ఇబ్బందులేమీ లేకుండా... ఏడు రోజుల్లోనే ఇంటి నిర్మాణం పూర్తి చేసింది ఆకర్షన్ ఇండస్ట్రీస్.
కర్ణాటక పుత్తూరులోని వివేకానంద కళాశాలలో ఏడు రోజుల్లోనే 550 చదరపు అడుగుల విస్తీర్ణంలో డ్రీమ్ హౌస్‌ను నిర్మించారు. అగ్రికల్చరల్ మిషన్ ఫెయిర్, డ్రీమ్ హౌస్ కార్యక్రమంలో భాగంగా నిర్మాణం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.
"నిర్మాణం 7 రోజుల్లో పూర్తి చేశాం. పూర్తిగా పరిశ్రమలో తయారు చేసిన వాటినే వాడాం. కాంక్రీట్‌తో ముందుగా తయారు చేసి వినియోగించే సాంకేతికతను ఉపయోగించాం. పరిశ్రమలో తయారు చేసిన వాటిని తీసుకొచ్చి ఇక్కడ జోడించాం. కాంక్రీట్ గోడలను జోడించడానికి పాలిమర్ ఆధారిత సిమెంట్ ఉపయోగించాం. రైల్వే స్లీపర్, ఎలక్ట్రిక్ పోల్స్, వంతెనలు నిర్మించడానికి ఉపయోగించే సాంకేతికతనే ఇక్కడ వాడాం. "
- సాదిక్, నిర్మాణదారుడు
ప్రాముఖ్యం
ఈ ఇంట్లో వంటగది, బాత్రూమ్తో పాటు మరో గది ఉన్నాయి. ఇంటి పైకప్పును రేకులతో ఏర్పాటు చేశారు. ఇవి వేసవిలోనూ వేడి నుంచి రక్షణ కల్పిస్తాయి. ఇంటి చుట్టు కంచె, బావి నిర్మాణం చేపట్టారు. ఈ ఇంటిని నిర్మించడానికి సుమారు రూ.7 లక్షలు ఖర్చు అయింది.
ఒక ప్రాంతంలో నుంచి తొలగించి మరో ప్రాంతంలో నిర్మించగలగటం దీని ప్రత్యేకత.