ప్రభుత్వం ఇటీవల బ్యాన్ చేసిన 59 చైనా యాప్‌లు.. సర్కార్ నిర్ణయాన్ని ఖండిస్తూ.. ఏ భారత కోర్టులోనైనా ప్రశ్నించే హక్కుందంటున్నారు సుప్రీం కోర్టు న్యాయవాదులు.
జాతీయ భద్రతకు భంగం కలిగిస్తున్నాయన్న కారణంగా.. జూన్ 29న 59 చైనా యాప్‌లను రద్దు చేసింది కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ. దీంతో.. బ్యాన్ జాబితాలో ఒకటైన 'టిక్‌టాక్' ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. బ్యాన్‌కు వ్యతిరేకంగా కేసు దాఖలు చేసేందుకు ప్రభుత్వంతో చర్చించనున్నట్లు స్పష్టం చేసింది.
బ్యాన్ న్యాయమేనా..?
సుప్రీం కోర్టు న్యాయవాదులు ఆదిత్యా పరోలియా, మీనాక్షి అరోరాల ప్రకారం... జాతీయ భద్రతకు భంగం కల్పించేలా ఉంటే.. సందేహం లేకుండా యాప్‌లు బ్యాన్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. ఉదాహరణకు.. ప్రజా విధానాలకు వ్యతిరేకంగా, అక్రమంగా, ప్రభుత్వ ఆంక్షలను కాలరాస్తూ చలామణి అవుతున్న పోర్న్ వెబ్సైట్లను నిరభ్యంతరంగా బ్యాన్ చేసే హక్కు ప్రభుత్వానికి ఉంది. అంటే, సరైన కారణం ఉంటే ప్రభుత్వం విధించే ఏ బ్యాన్ అయినా న్యాయపరమైందే అవుతుంది.
బ్యాన్ చేస్తే.. ఏం చేయగలరు?
సరైన కారణం లేకుండా బ్యాన్ విధించినట్లు సదరు యాప్ యజమానులు భావిస్తే.. వారు నిస్సందేహంగా హైకోర్ట్, సుప్రీం కోర్టుల్లో బ్యాన్‌ను వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేయొచ్చు. ఒకవేళ యాప్‌లో ఎలాంటి అభ్యంతరాలు లేనట్లు రుజువైతే.. ప్రభుత్వం జారీ చేసిన రద్దు ఉత్తర్వులు చెల్లవన్నారు అరోరా.
- భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21ల ప్రకారం విదేశీ పౌరులు సహా ప్రతి ఒక్కరూ భారత న్యాయస్థానాలను ఆశ్రయించి, న్యాయం కోసం పోరాడే హక్కుంది.
- బ్యాన్ చేసిన చైనా కంపెనీల్లో పనిచేస్తున్న భారత ఉద్యోగులు సైతం.. కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశముంది. సరైన కారణాలు లేకుండా బ్యాన్ చేస్తే.. వారిని నిరుద్యోగులు చేసే హక్కు ప్రభుత్వానికి లేదని సదరు ఉద్యోగులు పోరాడొచ్చు.
- అయితే, బ్యాన్ వల్ల ఉద్యోగాలు కోల్పోయినవారికి.. ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించాల్సిన అవసరం చట్టపరంగా ప్రభుత్వానికి లేదు.
ఇదీ చదవండి: 'చెప్పేవి 'స్వదేశీ' మాటలు.. దింపేవి చైనా వస్తువులు'