ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న 'బాబ్రీ' కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. నిందితులు కుట్రపూరిత నేరాలు పాల్పడ్డారనేందుకు ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది. వారిపై మోపిన అభియోగాలను కొట్టివేసింది. భాజపా సీనియర్ నేతలు ఎకే అడ్వాణీ, మురళీమనోహర్ జోషితో పాటు ప్రముఖ నేతలు ఉమాభారతి, కల్యాణ్ సింగ్, ప్రస్తుత రామాలయ నిర్మాణ బాధ్యతలు చూస్తున్న ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ సహా అందరినీ నిర్దోషులుగా తేల్చింది.
ఈ కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే...
1992, డిసెంబర్ 6- బాబ్రీ మసీదు ఘటన. ఫైజాబాద్‌లో రెండు కేసుల నమోదు. అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, బాల్ ఠాక్రే, ఉమా భారతితో పాటు 49మందిపై క్రిమినల్ కేసు నమోదు.
1993- సీబీఐ చేతికి ఈ హై-ప్రొఫైల్ కేసు దర్యాప్తు. కరసేవకులు, 49మంది నేతలపై రాయబరేలీ, లఖ్‌నవూలో దర్యాప్తు ప్రారంభం. భాజపా అగ్రనేతలను నేరానికి కుట్ర కేసులో భాగం చేసిన దర్యాప్తు సంస్థ.
1996- రెండు కేసులను కలుపుతూ నోటిఫికేషన్ విడుదల చేసిన యూపీ సర్కార్. కేసుపై అడ్వాణీ సహా నేతలు సవాల్ చేయగా.. రెండింటిని నేర కుట్ర విభాగంలోకి చేర్చిన సీబీఐ.
2001, మే 4- అడ్వాణీ సహా ఇతన నేతలపై నేరారోపణలను కొట్టేసిన సీబీఐ ప్రత్యేక కోర్టు.
2003- మరో ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన సీబీఐ. అడ్వాణీకి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు లేవన్న రాయబరేలీ కోర్టు. హైకోర్టు జోక్యంతో తిరిగి కొనసాగిన విచారణ.
2010, మే 23- అడ్వాణీ సహా ప్రముఖులపై నేరానికి కుట్ర కేసును కొట్టేసిన అలహాబాద్ హై కోర్టు.
2012- అలహాబాద్ హై కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించిన సీబీఐ. పునర్విచారణ చేపట్టాలని ఆదేశించిన సర్వోన్నత న్యాయస్థానం.
2017, ఏప్రిల్- రెండేళ్లలో విచారణ పూర్తి చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టును ఆదేశించిన సుప్రీం కోర్టు. రాయబరేలీ కేసును సైతం లఖ్‌నవూలోనే కలిపి విచారించాలని ఉత్తర్వులు.
2017-మే- ప్రారంభమైన రోజువారీ విచారణ. వాదనలు విన్న సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి. నిందుతులందరికీ ముందస్తు బెయిల్ కోరిన అడ్వాణీ.
2020 జులై- కరోనా కారణంగా అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి వాంగ్మూలాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రికార్డు చేసిన న్యాయస్థానం
2020, మే 8- ఆగస్టు 31 నాటికల్లా విచారణ పూర్తి చేయాలన్న సుప్రీం కోర్టు. కరోనా కారణంగా సెప్టెంబర్ 30 వరకు పొడిగింపు.
2020, సెప్టెంబర్ 30- నిందితులందరూ నిర్దోషులేనని సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు. నేరపూరిత కుట్రకు పాల్పడ్డారనేందుకు ఆధారాలు లేవని అభియోగాలు కొట్టివేత.
నిందితులు:
ఎల్ కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, సుధీర్ కక్కర్, సతీష్ ప్రధాన్, రాం చంద్ర ఖత్రి, సంతోష్ దుబే, కల్యాణ్ సింగ్, ఉమా భారతి, రాం విలాస్ వేదాంతి, వినయ్ కతియార్, ప్రకాశ్ శర్మ, గాంధీ యాదవ్, జై భాన్ సింగ్, లల్లూ సింగ్, కమలేశ్ త్రిపాఠి, బ్రిజ్ భూషన్ సింగ్, రాంజీ గుప్తా, మహంత్ నృత్య గోపాల్ దాస్, చంపత్ రాయ్, సాక్షి మహారాజ్, వినయ్ కుమార్ రాయ్, నవీన్ భాయ్ శుక్లా, ధర్మదాస్, జై భగవాన్ గోయల్, అమరనాథ్ గోయల్, సాధ్వి రితంభర, పవన్ పాండే, విజయ్ బహదూర్ సింగ్, ఆర్ ఎం శ్రీవాస్తవ, ధర్మేంద్ర సింగ్ గుజ్జర్, ఓం ప్రకాశ్ పాండే, ఆచార్య ధర్మేంద్ర
మరణించిన నిందితులు:
పరమహంస రామచంద్ర దాస్, వినోద్ కుమార్ వత్స్, రాం నారాయణ్ దాస్, డీబీ రాయ్, లక్ష్మీ నారాయణ దాస్, హర్గోవింద్ సింగ్, రమేష్ ప్రతాప్ సింగ్, దేవేంద్ర బహదూర్, ఆశోక్ సింఘాల్, గిరిరాజ్ కిశోర్, విష్ణుహరి దాల్మియా, మోరేశ్వర్, మహంత్ జగదీశ్ ముని మహరాజ్, వైకుంఠ్ లాల్ శర్మ, సతీష్ కుమార్ నాగర్, బాలా సాహెబ్ ఠాక్రే.