అయోధ్య తీర్పు వెలువడిన నేపథ్యంలో కేంద్రం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు.. అల్లర్లు చెలరేగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు కొనసాగిస్తున్నాయి. దేశ రాజధాని దిల్లీలో భద్రతా వ్యవస్థను పటిష్ఠం చేశారు. పలు ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు జారీ చేశారు. సమస్యలకు కారణమయ్యే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని దిల్లీ పోలీసు విభాగం వెల్లడించింది.
"అల్లర్లకు కారణమయ్యేవారు, శాంతి భద్రతల సమస్యలు సృష్టించేవారిపై కఠిన చర్యలు చేపడతాం. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసే సమాచారంపైనా నిఘా ఉంటుంది. సామాజిక మాధ్యమ వినియోగదారులు ఏవిధమైన విద్వేషపూరిత, వ్యతిరేక పోస్టులు పెట్టకూడదు."
-దిల్లీ పోలీస్ విభాగం ప్రకటన
దిల్లీ జామా మసీదు సహా వివిధ ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను పెంచారు అధికారులు. ప్రత్యేక భద్రతా దళం జామా మసీదు ప్రాంతంలో పహారా కాస్తోంది.
ఉత్తర్‌ప్రదేశ్‌లో..
ఉత్తర్‌ప్రదేశ్‌లో సున్నితమైన ప్రాంతాలుగా 31 జిల్లాలను గుర్తించిన ప్రభుత్వం.. ఆయా ప్రదేశాల్లో 144 సెక్షన్‌ను విధించింది. అయోధ్య సహా యూపీ అంతా డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5 లేదా అంతకన్నా ఎక్కువమంది కలిసి తిరగటంపై నిషేధం విధించింది. ప్రతి జిల్లాల్లో తాత్కాలిక జైళ్లను ఏర్పాటు చేసింది ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం.
రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర హోంశాఖ సంప్రదింపులు జరుపుతూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. రాష్ట్రంలో 4 వేల కేంద్ర పారామిలిటరీ బలగాలను మోహరించింది హోంశాఖ. సామాజిక మాధ్యమాలకు సంబంధించి 670 మందిపై నిఘా పెట్టినట్లు అధికారులు తెలిపారు.
రాష్ట్రాల్లో..
రాజస్థాన్‌లోని భరత్‌పుర్ సహా మరికొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో రేపు ఉదయం 6 గంటల వరకు అంతర్జాల సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జైసల్మేర్‌లో ఈ నెల 30 వరకు 144 సెక్షన్ విధించారు.
తీర్పు వెలువడిన నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వమూ భద్రతను పెంచింది. ఆ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులను అందుబాటులో ఉండాలని ఆదేశించింది. స్థానిక పోలీసులతో కలిసి సమన్వయం చేసుకోవాలని తెలిపింది.
ఇదీ చూడండి: అయోధ్య కేసు: సుప్రీం తీర్పులో ప్రధానాంశాలివే..