అయోధ్యలో రామ మందిర నిర్మాణం మరో ఆరు నెలల్లో ప్రారంభమవుతుందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధ్యక్షుడు మహంత్ నృత్యగోపాల్ దాస్ అన్నారు. తదుపరి జరిగే ట్రస్టు సమావేశంలో మందిర నిర్మాణం ప్రారంభ తేదీని ఖరారు చేస్తామని స్పష్టం చేశారు.
ప్రజల సహకారంతో..
సీతారాములు నడయాడిన చోటే ఆలయం నిర్మిస్తామని మహంత్ తెలిపారు. రామమందిర నిర్మాణం చిన్నపాటి మార్పులతో మునుపటి నమూనాతోనే ఉంటుందని స్పష్టం చేశారు. అయితే ఆలయాన్ని ప్రభుత్వ నిధులు, చందాలతో కాకుండా ప్రజల సహకారంతో నిర్మిస్తామన్నారు.
శాంతియుతంగా జరగాలి!
రామమందిర నిర్మాణం ఎలాంటి అసమ్మతికి తావు లేకుండా శాంతియుతంగా పనులు జరగాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించినట్లు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ చెప్పారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధ్యక్షుడు మహంత్ నృత్యగోపాల్ దాస్ సహా ట్రస్టు సభ్యులు రాయ్, కె.పరాశరన్, స్వామి గోవింద్ గిరి మహారాజ్లు మోదీని గురువారం ఆయన నివాసంలో కలిశారు. రామ మందిర నిర్మాణం కోసం చేసే భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించారు. అయితే ఈ వేడుకకు ఇంకా ముహూర్తం ఖరారు కావాల్సి ఉంది.
రామోత్సవ్
శ్రీరామ నవమి సందర్భంగా మార్చి 25 నుంచి ఏప్రిల్ 8 వరకు 'రామ ఉత్సవ్'ను నిర్వహించాలని సన్నాహాలు చేస్తోంది విశ్వహిందూ పరిషత్. 2.75 లక్షల గ్రామాలకు చెందిన వీహెచ్పీ కార్యకర్తలు ఈ వేడుకల్లో పాల్గొంటారని సంస్థ సభ్యులు తెలిపారు.
ఇదీ చూడండి: కరోనా: ఇరాన్లో ఇద్దరు బలి.. చైనా జైళ్లల్లోనూ కేసులు