కొన్నేళ్లుగా వాయిదాలు పడుతూ వస్తున్న అయోధ్య వివాదంపై కీలక నిర్ణయం తీసుకుంది సుప్రీంకోర్టు. వివాద శాశ్వత పరిష్కారానికి మధ్యవర్తిత్వమే మార్గమని తీర్మానించింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కల్లీఫుల్లా ఛైర్మన్‌గా మధ్యవర్తిత్వ ప్యానెల్ ఏర్పాటుచేసింది.
ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచును సభ్యులుగా నియమిస్తూ జస్టిస్ రంజన్‌గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది.
సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే ప్రక్రియ మొత్తం జరగనుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫైజాబాద్‌లో చర్చలు జరపాలని నిర్దేశించింది న్యాయస్థానం. 8 వారాల్లోగా మధ్యవర్తిత్వ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. 4 వారాల్లో పురోగతి నివేదిక సమర్పించాలని సూచించింది. సంబంధిత కార్యాచరణ వారంలోగా ప్రారంభించాలని స్పష్టంచేసింది సుప్రీంకోర్టు.
ఇదీ చూడండి:అయోధ్య తీర్పు నేడే.!
అవసరమైతే మధ్యవర్తిత్వ సంఘంలో సభ్యులుగా మరికొందరిని తీసుకోవచ్చని సూచించింది కోర్టు. ప్రక్రియ ఏమైనా క్లిష్టమైతే ప్యానెల్ ఛైర్మన్ అపెక్స్ కోర్టు రిజిస్ట్రీని సంప్రదించవచ్చని తెలిపింది.
మీడియాపై నిషేధం
మధ్యవర్తిత్వం ప్రక్రియ అత్యంత రహస్యంగా జరపాలని నిర్ణయించిన అత్యున్నత న్యాయస్థానం.. ఈ అంశంలో ప్రసార మాధ్యమాలపై నిషేధం విధించింది. ప్రింట్, ఎలక్ట్రానిక్... ఇలా మీడియా ఏదైనా ఆంక్షలు వర్తిస్తాయని స్పష్టం చేసింది.
అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని సున్నీ వక్ఫ్ బోర్డ్, నిర్మోహి అఖాడా, రామ్ లల్లాకు సమానంగా పంచాలని 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పునకు వ్యతిరేకంగా ఇప్పటివరకు సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి.