ప్రతి తరంలోను ఆ తరం ఆలోచనలను ముందుకు తీసుకెళ్లే బోయీలుంటారు. వారిని దీపధారులు(టార్చ్ బేరర్స్) అంటారు. వారి కంఠాలు ఆ తరం ఆకాంక్షల్ని లోకానికి పరిచయం చేస్తూ ఉంటాయి. తాజాగా ‘మిస్ అమెరికా 2020’ పోటీలో విజేతగా నిలిచిన కెమిల్లె ష్రియర్ అలాంటి ఒక దీపధారి. గెలుపు కిరీటాన్ని శిరస్సున ధరిస్తూ ఆమె ‘ఎన్నో ఏళ్లుగా అనుసరిస్తున్న కురచ ఈత దుస్తుల అంశాన్ని తొలగించిన కారణంగానే పోటీ పట్ల ఆసక్తి చూపించాను’ అని స్పష్టంగా ప్రకటించింది. ‘శరీరాలను కాదు, మా ప్రతిభా సౌందర్యాలను గమనించండి’ అంటున్న ఈ తరం యువతుల స్వరం ష్రియర్ మాటల్లో ప్రతిధ్వనించింది. నవలా లోకాన్ని విడిచిపెట్టి నవలోకాల్లోకి అడుగుపెడుతున్న ఆధునిక వనితల ఆలోచనా ధోరణికి దీన్ని ప్రతీకగా చెప్పుకోవాలి. స్త్రీవాద సభల్లో పురుషపుంగవులు అలవోకగా వల్లించే చిలకమర్తి ప్రసన్న యాదవంలోని ‘ముదితల్ నేర్వగ రాని విద్య గలదే, ముద్దార నేర్పించినన్’ అనేది స్త్రీ గడప దాటని నాటి మాట. పురుష భావజాలంలోంచి పుట్టుకొచ్చిన ఆ అభిప్రాయానికి ఏనాడో కాలం చెల్లింది. ఆ మహాకవే ఇప్పుడు ఉండి ఉంటే దాన్ని ‘ముదితల్ నేర్పగ లేని విద్య గలదే ముద్దార అర్థించినన్’ అని సవరించడానికి ఏ మాత్రం సంకోచించడేమో... ఎందుకంటే కొన్నేళ్లుగా స్త్రీ చైతన్యం అద్భుతంగా వికసించింది. ఆ మార్పును శీలా సుభద్రాదేవి తన కవితలో ‘ఎన్నో ఏళ్లుగా నిద్రించిన మా వ్యక్తిత్వం తుళ్లిపడి లేచింది. ఆవులించి జూలు విదిల్చింది’ అంటూ బాహాటంగానే ప్రకటించారు. తొలి స్త్రీవాద కవయిత్రి సావిత్రి చెప్పినట్లు ‘మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే మమ్మల్ని విభజించి పాలిస్తోంది’ అని ఆధునిక స్త్రీ గుర్తించడం ఈ మార్పునకు మూలకారణం.
భారతీయ మహిళపై చిన్నచూపు లేదు'
పాశ్చాత్య దేశాల సంగతి ఎలా ఉన్నా స్త్రీ సామర్థ్యం పట్ల భారతదేశానికి ఏనాడూ చిన్నచూపు లేదు. ‘మాతా సమం నాస్తి శరీర పోషణం, భార్యా సమం నాస్తి శరీర తోషణం...’ శరీర పోషణలో తల్లికి, సంతృప్తిని సమకూర్చడంలో భార్యకు మరెవరూ దీటు రారంటూ కుటుంబంలో స్త్రీల పాత్రకు ప్రాధాన్యం ఇస్తూనే, ఇంటా బయటా మహిళా సామర్థ్యానికి కవులు మంగళ హారతులు పట్టారు. ద్రౌపదిని అద్భుత లావణ్యవతిగా పరిచయం చేసింది మహాభారతం. ‘అఖిల లావణ్య పుంజంబును అబ్జభవుడు(బ్రహ్మ) మెలత(స్త్రీ)గా చేసి దీని నిర్మించె నొక్కొ!’ అని కౌరవ పత్నులందరూ అసూయపడ్డారని చెబుతూనే ‘వరమున పుట్టితిన్ భరత వంశము జొచ్చితి...’ అంటూ తన ఆభిజాత్యాన్ని ద్రౌపది ఎలా ప్రకటించిందో వర్ణించింది. మరోవైపు ‘దుర్వారోద్యమ బాహువిక్రమ’ గర్జనలను వినిపిస్తూ ద్రుపదరాజ తనయ దృఢ మహా చిత్తాన్ని ఆవిష్కరించింది. పరమ సుకుమార లలామ సత్యభామ ‘వేణిన్ చొల్లెము పెట్టి(జుట్టు ముడిపెట్టి) సంఘటిత నీవీ బంధయై(చీర బిగించి కట్టి) వలయాకార ధనుర్విముక్త విశిఖ వ్రాతాహతారాతియై’ భీకర పరాక్రమంతో నరకాసురుడికి నరకం చూపించిన వైనాన్ని భాగవతం వర్ణించింది. సహనానికి మారుపేరైన సీతమ్మతల్లి ఆగ్రహాన్ని ఆవాహన చేసుకొనేసరికి పది తలల రాక్షసుడు గడ్డిపోచలా విలవిలలాడాడని రామాయణం చెప్పింది. నిండుసభలో దుష్యంతుణ్ని నిలదీసి శకుంతల వివరించి చెప్పిన ధర్మపత్ని పాత్రను, పాత్రతను అర్థం చేసుకొంటే- ఇల్లాలు అనే పదానికి సరైన పుల్లింగ శబ్దం కోసం పురుషలోకం తడుముకోవలసి వస్తుంది. భారతీయ మహిళల విజ్ఞతను సమయజ్ఞతను లోకజ్ఞతను సాహిత్యలోకం ఏనాడూ తక్కువ అంచనా వేయలేదు.
మృగాడికి ఎదురొడ్డి నిలవాలి!
కాకపోతే మధ్యలో మగజాతికి పురుషాధిక్య భావజాలపు చీడ సోకింది. ‘నడమంత్రపు సిరి, నరాలమీద కురుపు ఒకే రాశిలోవి’ అని కథక చక్రవర్తి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి చెప్పినట్లుగా- ఆ భావజాలపు సలుపు స్త్రీల అణచివేతకు దారితీసింది. క్రమంగా ‘కామము చూడ సృష్టి ప్రథమ అహంకారమే జానకీ’ అంటూ విర్రవీగిన రావణాసురుడికి, ‘ద్రౌపది మా దాసి’ అని కూసిన దుర్యోధనుడికి నరలోకంలో అనుచరగణం పెరుగుతూ వచ్చింది. మృగవాంఛతో రెచ్చిపోవడమే మగటిమికి నిదర్శనం అనుకొనే నీచ ప్రవృత్తి లోకంలో విస్తరించింది. అణచివేత ఉన్నచోట తిరుగుబాటు తథ్యమని చరిత్ర చెబుతోంది. ‘కంఠనాళిక’ కవయిత్రి చెప్పినట్లుగా ‘మూలుగు ప్రతిఘటనై అరుపై కేకలై పెడబొబ్బలై- నినాదమైతే అదే ‘ఆమె’ తొలి ఆయుధం’గా అవతరించింది. అది తొలుత చినుకు చినుకుగా స్త్రీవాద ఉద్యమంగా రూపుదిద్దుకొని ఉప్పెనగా లోకాన్ని ముంచెత్తింది. కవయిత్రి మాటల్లో ‘చైతన్య జ్వలన గోళాన్ని ఆవాహన చేసుకొన్న వేకువ ఆశల వేయిరేకుల పూవై’ నిలదీసి ప్రశ్నిస్తోంది. తెలంగాణ రాష్ట్ర మహిళా భద్రతా విభాగం కొత్త సంవత్సర కానుకగా ప్రతి కళాశాలలోను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న స్త్రీ సహాయక బృందాలను(షీ టీమ్స్) ఆ కోణంలోంచే మనం స్వాగతించవలసి ఉంది. వేధింపులు, ఆకతాయి చేష్టలు ఎదురైతే బాధితులు పోలీసుల దాకా పోనక్కర లేదు. తమ స్నేహితుల్లోంచే వాలంటీర్లుగా ముందుకొచ్చిన ఆ బృందానికి సమాచారం ఇస్తే చాలు. కాగల కార్యం గంధర్వుల చేత వారే పూర్తిచేయిస్తారు. ఆ స్ఫూర్తి మరింతగా విస్తరించి బాధిత యువతుల సంఖ్యకన్నా పోరాట యోధురాండ్ర సంఖ్య త్వరలోనే అనేక రెట్లు పెరిగి తీరుతుందని పరిశీలకుల ఆశాభావం. సహజ మనోధైర్యానికి ఈ బలవర్ధక ఔషధం జతపడితే స్త్రీ స్వయం శక్తిస్వరూపిణిగా రూపాంతరం చెందే అవకాశాలు చాలా ఉన్నాయి. దీన్ని స్త్రీ జాతికి మేలుకొలుపుగా కాలగతిలో మేలిమలుపుగా చెప్పుకోవచ్చు.
ఇదీ చూడండి: 16ఏళ్లలో 2019లోనే పాక్ అత్యధిక కాల్పులు