అసోం జాతీయ పౌర జాబితా(ఎన్ఆర్సీ) తుది జాబితాలో లక్షలమంది పేర్లు గల్లంతుపై.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్ఎస్ఎస్తోపాటు అనుబంధ సంస్థలతో రాజస్థాన్‌లోని పుష్కర్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సహా 200మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సమావేశంలో అసోం ఎన్ఆర్సీ, జమ్ముకశ్మీర్- ఆర్టికల్ 370 రద్దు అంశాలపై సంఘ్ ప్రతినిధులు చర్చించారు. ఎన్ఆర్సీ తుదిజాబితాలో పేర్లు లేని 19లక్షల మందిలో అత్యధికులు హిందువులేనని సంఘ్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ ట్రిబ్యునల్స్‌లో నిజమైన పౌరులకు వ్యతిరేకంగా తీర్పు వస్తే వారి రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొస్తుందని భాజపా నేతలు చెప్పారు.
మరోవైపు కశ్మీర్‌కు సంబంధించిన అధికరణ 370 రద్దు నిర్ణయాన్ని సంఘ్ సభ్యులు ప్రశంసించారు.
'ఆ 40 లక్షల మంది ఎక్కడా?'
అసోంలో 40 లక్షల మంది అక్రమ వలసదారులున్నారని గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ విమర్శల వర్షం కురిపించారు. అది నిజమే అయితే వారంతా ఇప్పుడెక్కడున్నారని ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు.
ఇదీ చూడండి: 'విక్రమ్' కోసం మరో 14 రోజులు అన్వేషణ : శివన్