కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అసోం జాతీయ పౌర జాబితాపై ఆందోళన వ్యక్తం చేశారు తృణమూల్ అధినేత్రి. దిల్లీ నార్త్‌బ్లాక్‌లో ఆయన కార్యాలయానికి వెళ్లి ఎన్ఆర్సీపై చర్చించారు.
అసోం పౌర జాబితాలో పేరు దక్కని వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ లేఖ అందించారు మమతా. జాబితాలో చాలా మంది నిజమైన భారతీయులు చోటుకోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బంగాల్ ఎన్ఆర్సీ అమలు అంశంపై విలేకరులు అడగగా... హోంమంత్రి అదేం మాట్లాడలేదని తెలిపారు మమత. తాను వచ్చింది అసోం ఎన్ఆర్సీపై మాట్లాడడానికే తప్ప బంగాల్ అంశం కాదన్నారు.
"హోంమంత్రికి ఒక లేఖ అందజేశా. అసోం జాతీయ పౌర జాబితాలో చోటు దక్కని 19 లక్షల మందిలో చాలా మంది హిందీ, బెంగాలీ మాట్లాడేవారు, గుర్కాలు, స్థానిక అస్సామీలు ఉన్నట్లు చెప్పా. చాలా మంది నిజమైన ఓటర్ల పేర్లు జాబితాలో లేవు. వారిని తప్పకుండా భారతీయులుగా గుర్తించాలి. ఈ అంశంపైనే అధికారికంగా లేఖ సమర్పించా. పశ్చిమ బంగాలో ఎన్ఆర్సీ అమలుపై ఆయన ఏం ప్రస్తావించలేదు."
- మమతాబెనర్జీ, పశ్చిమ బంగ ముఖ్యమంత్రి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో బుధవారం సమావేశమయ్యారు మమత. బంగాల్ రాష్ట్రం పేరు మార్పు సమస్యపై చర్చించారు. రాష్ట్రంలోని బొగ్గు గని ప్రారంభానికి రావాలని మోదీని ఆహ్వానించారు.
ఇదీ చూడండి: 'చిదంబరం కస్టడీ పొడిగించండి': దిల్లీ కోర్టుకు సీబీఐ వినతి