దేశంలో కనీసం 27 శాతం మంది విద్యార్థులు ఆన్లైన్ తరగతులకు హాజరయ్యే పరిస్థితిలో లేరని జాతీయ విద్య, పరిశోధన, శిక్షణ మండలి(ఎన్సీఈఆర్టీ) అధ్యయనంలో తేలింది. మరో 28 శాతం మందికి విద్యుత్తు సరఫరా పరమైన ఇబ్బందులు ఉన్నాయని బయటపడింది. విద్యుత్తు పూర్తిగా లేకపోవడమో, మధ్య మధ్యలో అవాంతరాలు రావడమో వీరిని ఇబ్బందికి గురి చేస్తున్నట్లు అధ్యయనం పేర్కొంది. కేంద్రీయ విద్యాలయాలు, సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలలు, నవోదయా విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రిన్సిపాళ్ల నుంచి ఎన్సీఈఆర్టీ ఈ సమాచారాన్ని సేకరించి, క్రోడీకరించింది. 34,000 మందికి పైగా దీనిలో పాల్గొన్నారు.
అధ్యయనంలోని ఇతర అంశాలు..
- స్మార్ట్ఫోన్లు, లాప్‌టాప్‌లలో పాఠాలు ఎలా వినాలో చాలా మందికి అవగాహన లేదు.
- ఆన్లైన్ బోధన పద్ధతులపై ఉపాధ్యాయులకూ పూర్తిస్థాయిలో పట్టు రాలేదు.
- ఆన్లైన్లో వినడానికి ఫోన్లనే మాధ్యమంగా ఎక్కువ మంది వినియోగించుకుంటున్నారు. ఫోన్ల తర్వాత ఉపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు లాప్‌టాప్‌లకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
- పాఠాలు చెప్పడానికి, వినడానికి అత్యంత తక్కువగా వాడుతున్నవి టీవీలు, రేడియోలు.
- తరగతిలో మాదిరిగా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎదురెదురుగా సంభాషించుకునే అవకాశం ఆన్లైన్లో అంతగా లేకపోవడం ప్రధాన అవరోధం.
- పాఠ్యపుస్తకాలు 50 శాతం మందికి అందుబాటులో లేవు.
- ఎన్సీఈఆర్టీ వెబ్సైట్లో ఇ-పాఠ్య పుస్తకాలు అందుబాటులో ఉన్నా.. మెదటి నుంచీ ముద్రిత పాఠ్యపుస్తకాలు చదివే అలవాటు ఉన్న విద్యార్థులు వాటిని అంతగా వినియోగించుకోవట్లేదు. అవగాహన లేమి, సాధనాల కొరత వంటివి దీనికి ప్రధాన కారణాలు.
లెక్కలతో చిక్కులే...
- ఎదురుగా ఉపాధ్యాయుడు అందుబాటులో ఉండి బోధిస్తున్నప్పుడే గణితాన్ని అర్థం చేసుకునేందుకు చాలా మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటారు. అలాంటిది ఆన్లైన్లో లెక్కలు నేర్చుకోవడం మరీ కష్టమవుతోందని సర్వేలో పాల్గొన్నవారిలో ఎక్కువ మంది చెప్పారు.
- గణితం తర్వాత ఎక్కువ మందిని సైన్స్ పాఠాలు ఇబ్బంది పెడుతున్నాయి. ప్రయోగశాలలో ప్రయోగాలకు ఆస్కారం ఉండట్లేదు.
- ఆన్లైన్ ద్వారా సాంఘిక శాస్త్రం నేర్చుకోవడమూ సులభంగా లేదని పలువురు చెప్పారు.
ఇదీ చూడండి: దేశంలో ఒక్కరోజే 68,898 కరోనా కేసులు.. 983 మరణాలు