అక్షరాస్యతలో మళ్లీ కేరళ రాష్ట్రమే అగ్రస్థానంలో నిలిచింది. దేశంలోనే అత్యధికంగా 96.2 శాతం అక్షరాస్యత నమోదు చేసింది. 66.4 శాతంతో ఆంధ్రప్రదేశ్ అధమ స్థానంలో ఉంది. ఈ మేరకు జాతీయ గణాంకాల సంస్థ(ఎన్ఎస్ఓ) నివేదిక విడుదల చేసింది.
జాతీయ నమూనా సర్వే 75వ రౌండ్లో భాగంగా జూలై 2017-జూన్ 2018వరకు చేపట్టిన సర్వే వివరాలను 'భారతదేశంలో విద్య- సామాజిక గృహ వినియోగం' అనే పేరుతో నివేదికను విడుదల చేసింది ఎన్ఎస్ఓ. ఏడేళ్లు, అంతకంటే ఎక్కువ వయసు గల వారిలో అక్షరాస్యతపై రాష్ట్రాల వారీగా ఈ సర్వే నిర్వహించింది.
దేశంలో ఇలా..
దేశ అక్షరాస్యత సగటు 77.7 శాతంగా ఉంది. గ్రామీణా ప్రాంతాల్లో 73.5 శాతం, పట్టణ ప్రాంతాల్లో 87.7 శాతంగా ఉంది. పురుషుల్లో 84.7శాతం, మహిళల్లో 70.3 శాతం అక్షరాస్యులున్నట్లు వెల్లడైంది. అన్ని రాష్ట్రాల్లోనూ మహిళల కంటే పురుషులే ఎక్కువ అక్షరాస్యత కలిగి ఉన్నారు.
కంప్యూటర్ వినియోగం...
గ్రామీణా ప్రాంతాల్లో 4 శాతం, పట్టణ ప్రాంతంలో 23 శాతం కంప్యూటర్ను వినియోగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 15-29 ఏళ్ల మధ్య వయసు వారు 24 శాతం, పట్టణాల్లో అయితే 56 శాతం మంది కంప్యూటర్ ఉపయోగిస్తున్నారు.
తొలి ఐదు రాష్ట్రాలు..
ఎన్ఎస్ఓ నివేదిక ప్రకారం... దిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, అసోం రాష్ట్రాలు కేరళ తర్వాత మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
చివరి నుంచి..
మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, తెలంగాణ, బిహార్, రాజస్థాన్ రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కంటే ముందు వరుసలో ఉన్నాయి.
రాష్ట్రం | అక్షరాస్యత శాతం |
కేరళ | 96.2 |
దిల్లీ | 88.7 |
ఉత్తరాఖండ్ | 87.6 |
హిమాచల్‌ప్రదేశ్ | 86.6 |
అసోం | 85.9 |
మధ్యప్రదేశ్ | 73.7 |
ఉత్తర్‌ప్రదేశ్ | 73 |
తెలంగాణ | 72.8 |
బిహార్ | 70.9 |
రాజస్థాన్ | 69.7 |
ఆంధ్రప్రదేశ్ | 66.4 |
ఇదీ చూడండి: 'జీడీపీ పతనం ఆందోళనకరం- అప్రమత్తత అత్యవసరం'