పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్య భారతం భగ్గుమంటోంది. ముఖ్యంగా అసోంలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఉద్రిక్తంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అసోం ముఖ్యమంత్రి శర్బానంద్ సోనోవాల్ అతి త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాతో సమావేశంకానున్నారు. ఈ విషయాన్ని అసోం పార్లమెంట్ వ్యవహారాలమంత్రి చంద్రమోహన్ వెల్లడించారు.
రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులను భాజపా అగ్రనేతలకు సోనోవాల్ వివరించనున్నట్టు చంద్రమోహన్ స్పష్టం చేశారు. ప్రజలు శాంతించాలని, పౌరసత్వ చట్ట సవరణతో స్థానికులకు ఎలాంటి నష్టం జరగదని పునరుద్ఘాటించారు.
నిరసనలు...
అసోంలో నిరసనలు తారస్థాయికి చేరాయి. శనివారం ఓ ఇంధన ట్యాంకర్ను తగలబెట్టారు నిరసనకారులు. ఈ ఘటనలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
హింసాయుత నిరసనల దృష్ట్యా అసోంలో డిసెంబర్ 16 వరకు అంతర్జాల సేవలు నిలిపి వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఈశాన్య భారతంలో పర్యటించే సమయంలో జాగ్రత్త వహించాలని అమెరికా, బ్రిటన్ సహా వివిధ దేశాలు తమ పౌరులకు సూచించాయి.