పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాలు చేపట్టిన నిరసనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా అసోంలో పౌర నిరసనలు భారీ స్థాయిలో జరిగాయి. దీని వల్ల ఆ రాష్ట్ర పర్యటక రంగం తీవ్రంగా దెబ్బతింది. పౌర నిరసనలతో దాదాపు 1,000 కోట్ల నష్ట్రం అంచనా వేస్తున్నట్టు ఓ అధికారి వెల్లడించారు.
అసోం పర్యటక రంగానికి డిసెంబర్- మార్చి మధ్య కాలం ఎంతో ముఖ్యం. మొత్తం ఏడాదిలో 48శాతం లబ్ధి ఈ నెలల నుంచే పొందుతుంది అసోం పర్యటక అభివృద్ధి సంస్థ(ఏటీడీసీ). కానీ పౌర నిరసనల వల్ల డిసెంబర్లో పర్యటకుల సంఖ్య భారీగా తగ్గిందని.. జనవరిలోనూ ఇదే కొనసాగే అవకాశముందని అభిప్రాయపడింది.
డిసెంబర్ 11 నుంచి హొటల్ పరిశ్రమలు కూడా భారీగా నష్టపోయాయి. 15 రోజుల్లో రూ.60 కోట్ల నష్టం వాటిల్లింది.
దేశీయ పర్యటకులతో పాటు విదేశాల నుంచి వచ్చే వారి సంఖ్యా భారీగా పడిపోయింది. భారత్‌లో పర్యటించాలంటే జాగ్రత్త వహించాలని ఆయా దేశాలు సూచించడం కూడా ఇందుకు ఓ కారణం.
"శాంతియుత నిరసనల వల్ల పెద్దగా ప్రభావం పడదు. కానీ హింసాయుత ఆందోళనలు చాలా నష్టం కలిగిస్తాయి. ఈ ఏడాది 65 లక్షలమంది స్వదేశీయులు, 50వేల మంది విదేశీయులు రాష్ట్రంలో పర్యటిస్తారని అంచనా వేశాం. కానీ డిసెంబర్, జనవరి నెలల్లో 80శాతం బుకింగ్స్ రద్దయ్యాయి. ఫిబ్రవరిలో పరిస్థితి మెరుగుపడుతుందని ఆశిస్తున్నాం."
--- జయంత్ బరౌహ్, ఏటీడీసీ ఛైర్మన్.
దెబ్బతిన్న పర్యటక వ్యవస్థను గాడిన పడేయడానికి ఏటీడీసీ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా దేశంలోని వివిధ నగరాల్లో రోడ్‌షోలు నిర్వహించి స్వదేశీ పర్యటకులను ఆకర్షించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. విదేశీ పర్యటకుల కోసం సూచనలు జారీ చేసిన దేశాల(ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా, బ్రిటన్)తో సంప్రదింపులు జరపనుంది.
ఇదీ చూడండి:- నేటి అర్ధరాత్రి నుంచి కశ్మీర్లో అంతర్జాల నిషేధంపై సడలింపు