అసోంలో జాతీయ పౌర రిజిస్ట్రర్ తుది జాబితా నేడు విడుదల కానుంది. ఆగస్టు 31వ తేదీలోపు జాబితా విడుదల చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎన్‌ఆర్‌సీ విడుదలకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ నేపథ్యంలో ఎలాంటి శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.
కేంద్రం భరోసా
జాబితా విడుదల నేపథ్యంలో స్థానికులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. జాబితాలో పేరు ఉంటుందో ఉండదోనని భయపడుతున్నారు.
"నాకు ఏమీ అర్థం కావట్లేదు. నేను అన్ని ధ్రువపత్రాలు సమర్పించాను. 2011లో నేను ఓటు హక్కు వచ్చింది. ఓటర్, ఆధార్, పాన్ కార్డు పొందాను. నా పాఠశాల సర్టిఫికేట్లు కూడా ఇచ్చాను. 2,3 సార్లు పరిశీలించారు. అయినా నా పేరు జాబితాలో లేదు. అర్హులైన వారు పేర్లు జాబితాలో ఉండాలి. విదేశీయుల పేర్లను తొలగించి పంపించివేయాలి."
-నూర్జమాన్ ఖాన్, దుకాణదారుడు
సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఎన్‌ఆర్‌సీ రూపకల్పన జరిగినందున ఎలాంటి ఆందోళన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తోంది. జాబితాలో పేరు లేకపోతే పైకోర్టులను ఆశ్రయించవచ్చని సూచిస్తోంది. అప్పీలు చేసుకునేందుకు గడువును 120 రోజులకు పెంచింది.
ఫారెన్ ట్రైబ్యునళ్ల పెంపు
ప్రస్తుతమున్న 100 ఫారెనర్ ట్రైబ్యునళ్లకు అదనంగా మరో 200 ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ట్రైబ్యునల్ తీర్పు వ్యతిరేకంగా వస్తే హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించవచ్చని సూచిస్తున్నారు. అదే సమయంలో నిజమైన అర్హులకు అన్యాయం జరగకుండా న్యాయసహాయం అందిస్తామని హామీ ఇస్తున్నారు.
ఆధార్ కార్డు
జాబితాలో కొత్తగా చోటు దక్కిన వారికి ఆధార్ కార్డులు జారీ చేస్తామని అధికారులు తెలిపారు. 2018 జూలై 30న ప్రకటించిన ఎన్‌ఆర్‌సీ ముసాయిదాలో పేరు తొలగించిన తర్వాత భారతీయ పౌరసత్వాన్ని రుజువు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ క్రమంలో 36 లక్షల మంది నుంచి బయోమెట్రిక్ వివరాలు తీసుకున్నారు. చోటు దక్కనివారు తమ పౌరసత్వాన్ని నిరూపించుకోలేకపోతే ఆధార్ కార్డు పొందడానికి అనర్హులని తెలిపారు.
న్యాయ సహాయానికి పార్టీలు సన్నద్ధం
నిజమైన పౌరులకు అన్యాయం జరగకుండా రాజకీయ పార్టీలు న్యాయ సహాయం అందించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పటికే భాజపా, కాంగ్రెస్ ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అసోంలోని 14 లోక్‌సభ స్థానాలకు గానూ 9 చోట్ల గెలుపొందింది భాజపా. రాష్ట్రంలోని మెజారిటీ బెంగాలీ హిందువులు తమకు మద్దతుగా నిలిచినట్లు భావిస్తోంది. ఈ నేపథ్యంలో వారికి సాయం అందించేందుకు సన్నద్ధమవుతోంది.
కట్టుదిట్టమైన భద్రత
జాతీయ పౌర రిజిస్టర్ తుది జాబితా విడుదల నేపథ్యంలో అసోంలో భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. హింస, మత ఘర్షణలు చెలరేగే అవకాశాలు ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. వదంతులు నమ్మవద్దని, సంయమనం పాటించాలని ప్రజలకు పోలీసు విభాగం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ విజ్ఞప్తి చేశాయి.
సున్నిత ప్రాంతాల్లో 144 సెక్షన్
ఎన్‌ఆర్‌సీ జాబితాలో చోటు లభించనివారి భద్రత కోసం అన్ని ఏర్పాట్లూ చేసినట్లు అసోం పోలీసు విభాగం తెలిపింది. ట్రాఫిక్, పాలన, న్యాయవ్యవస్థ సజావుగా నడిచేందుకు వీలుగా గువహటితో పాటు రాష్ట్రంలోని ఇతర సున్నితమైన ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ఎన్‌ఆర్‌సీ జాబితాలో పేర్లులేని వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్టు చేయమని అధికారులు స్పష్టం చేశారు. అప్పీలు, విచారణ ప్రక్రియ పూర్తయ్యాక, ఫారెన్ ట్రైబ్యునల్ విదేశీ పౌరులుగా ప్రకటిస్తేనే చర్యలు ఉంటాయని చెప్పారు.
అసలేంటీ ఎన్‌ఆర్‌సీ..
20వ శతాబ్దం మొదట్లో లక్షలాదిమంది బంగ్లాదేశీయులు అసోంకి వచ్చి స్థిరపడ్డారు. ముఖ్యంగా 1826 యండబో ఒప్పందం అనంతరం తూర్పు పాకిస్థాన్.. అంటే నేటి బంగ్లాదేశ్ నుంచి హిందువులు, ముస్లింలు అసోంలోకి పెద్ద ఎత్తున వలస వచ్చారు. స్వాతంత్ర్యం అనంతరం కూడా ఈ ప్రక్రియ కొనసాగిన నేపథ్యంలో అసోం సంస్కృతి, భాష దెబ్బతింటోందంటూ ఆందోళనలు ప్రారంభమయ్యాయి.
సుప్రీం ఆదేశాలు
అక్రమంగా ప్రవేశించిన వారిని గుర్తించి, నిర్బంధించి తరలించాలంటూ అసోం విద్యార్థి సంఘం నేతృత్వంలో సుమారు ఆరేళ్ల పాటు ఆందోళనలు జరిగాయి. 1985లో జరిగిన అసోం ఒప్పందంతో ఈ ఉద్రిక్తతలు తాత్కాలికంగా సద్దుమణిగాయి. ఈ మేరకు ఎన్‌ఆర్‌సీ జాబితా రూపొందించాలని సుప్రీంకోర్టు 2013లో ఆదేశించింది. 1951 నాటి ఎన్‌ఆర్‌సీని నవీకరించాలని స్పష్టం చేసింది.
41 లక్షల మంది విదేశీయులు!
అర్హులను గుర్తించేందుకు 1971 మార్చి 24ను కటాఫ్ తేదీగా నిర్ణయించింది ప్రభుత్వం. ఈ మేరకు జాబితా ప్రక్రియను 2015లో ప్రారంభించి 2017 డిసెంబర్ 31న ఎన్‌ఆర్‌సీ ముసాయిదాను విడుదల చేసింది. అనంతరం గతేడాది జులై 30న తుది ముసాయిదాను ప్రకటించారు. మొత్తం 3.29 కోట్ల మంది దరఖాస్తు చేసుకోగా తుది ముసాయిదాలో 2.89 కోట్ల మందికి స్థానం దక్కింది. మిగిలిన 40 లక్షల మందిని విదేశీయులుగా అధికారులు పేర్కొన్నారు.
ఈ ఏడాది జూన్ 26న మరోసారి ముసాయిదాను ప్రకటించిన అధికారులు మరో 1.02 లక్షల మందిని జాబితాలోనుంచి తొలగించారు. దీనిపై తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది.
ఇదీ చూడండి: అసోం ఎన్‌ఆర్‌సీ: 71ఏళ్ల వివాదానికి నేడే తెర!